భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు
భూమాకు బెయిల్ మంజూరు.. మరో 19 మందికి కూడా..
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ సమావేశంలో జరిగిన సంఘటనపై నమోదైన కేసులో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శుక్రవారం నంద్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు శివశంకర్, కొం డా రెడ్డి, కృపాకర్, దిలీప్, కరీముల్లా, మాజీ కౌన్సిలర్ ఏవీఆర్ ప్రసాద్, అజ్మీర్‌బాషాతో పాటు మరో 12 మందికి కూడా బెయిల్ మంజూ రు చేసినట్లు వైఎస్సార్సీపీ న్యాయవాదులు సూర్యనారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజేశ్వరరెడ్డి తెలిపారు.
గత నెల 31న నం ద్యాల పురపాలక సంఘ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మరో 19 మంది తనపై హత్యాయత్నం చేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన టూటౌన్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంతో భూమా నాగిరెడ్డితో పాటు మిగిలిన నిందితులు నవంబర్ ఒకటో తేదీన పోలీసుల సమక్షంలో హాజరవగా కోర్టు రిమాండ్ విధిం చింది. నంద్యాల మూడో అదనపు జిల్లా ఇన్‌చార్జి జడ్జిగా వ్యవహరిస్తున్న కర్నూలు ఒకటో అదనపు జిల్లా జడ్జి రామలింగారెడ్డి శుక్రవారం కేసును విచారించి బెయిల్ మంజూరు చేశారు. కాగా.. మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన 225/2014 కేసులో భూమా నాగిరెడ్డి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతుండటంతో ఆయనను రిమాండ్‌కు ఇవ్వలేదు.