రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆక్రోశం పులిచింతల ప్రాజెక్టు వద్ద కాకుండా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ ఎదుట వ్యక్తం చేస్తే బాగుంటుందని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు.
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆక్రోశం పులిచింతల ప్రాజెక్టు వద్ద కాకుండా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ ఎదుట వ్యక్తం చేస్తే బాగుంటుందని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన నిర్ణయంపై ప్రజలు, ఉద్యోగులు అంకితభావంతో ఆందోళనలు చేపట్టగా సీఎం స్వయంగా నీరుగార్చారన్నారు.
తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు కలసి రావాలని మొదటి నుంచి కోరుతున్నా స్పందించని కాంగ్రెస్.. తాజాగా అన్ని పార్టీలను కలుపుకుపోతామని చెబితే ఎవరూ నమ్మరన్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే..విభజన ఆయనకు తప్ప ఎవరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. విభజన సందర్భంగా కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి హాజరైన మంత్రులు సమైక్యాంధ్ర గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీలపై చర్చించుకోవడం బాధాకరమన్నారు. వ్యాపారస్తులు రాజకీయ నాయకులైతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ సమావేశం కళ్లకు కట్టిందన్నారు.