దాడి వీరభద్రరావు
యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. గురువారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి తొమ్మిది రోజులవుతున్న ముఖ్యమంత్రిని నియమించాలా లేకా రాష్ట్రపతి పాలన విధించాలా అనేది మాత్రం తేల్చుకోలేక పోతుందన్నారు. రాష్ట్రంలో సీఏం పదవికి కాంగ్రెస్ అధిష్టానం వేలం పాట నిర్వహిస్తున్నట్టుందని దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు.
సీమాంధ్రలో రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తామని ప్రకటించడం విచారకరమన్నారు. రానున్న ఎన్నికలలో గెలుపొందే ఎమ్మెల్యేలకు రాజధానిని నిర్ణయించుకునే హక్కు కూడా ఇవ్వరా అంటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంత అయిపోయాక కొత్త పార్టీ పెట్టి ఏం లాభం అంటూ అపద్ధర్మ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని దాడి ప్రశ్నించారు. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసం కిరణ్ మాయమాటలు చెప్పి విభజనకు సహకరించారని విమర్శించారు.
మొదటి నుంచి విభజన వాది అయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమైక్యం కోసం కృషి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది బాబే అన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్లో టీడీపీ సవరణలు ఇవ్వకుండా సమైక్యం కోసం పోరాడుతున్నామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాలనలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చయకుండా ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగులలో అభద్రతభావాన్ని కలిగించింది మీరు కాదా అంటు చంద్రబాబును ప్రశ్నించారు.