సోనియా నిర్ణయాన్ని గౌరవించరా?
సీఎంకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇప్పుడా నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత లేదా? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలని సోనియా, యూపీఏ తీసుకున్న నిర్ణయం తప్పా? అని నిలదీశారు. తాను ఏఐసీసీ, యూపీఏ నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుంటే కొంతమందికి మింగుడు పడడం లేదన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ ఉద్యోగులు, అధికారుల సంఘం 2014 డైరీని శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాసనసభలో బిల్లుపై చర్చ జరగవద్దనే కుట్ర జరుగుతోందని చెప్పారు. తన శాఖ మార్చినంత మాత్రాన రాష్ట్ర పునర్విభజన ఆగదని, ఆలస్యం చేయాలనుకునే శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సంఖ్యాబలం తమకుందని, బిల్లుకు అసెంబ్లీలో సవరణలు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పునర్నిర్మాణంలో ఉద్యోగులు, అధికారులు కీలకపాత్ర పోషించాలని కోరారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. జనవరి 26 తర్వాత తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో మరో రాజ్యాంగ అంకం ప్రారంభమవుతుందని చెప్పారు. సీఎం కుట్రపూరిత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని ఎమ్మెల్సీ కె.ఆర్. ఆమోస్ వ్యాఖ్యానించారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వంద మంది కిరణ్‌లు వచ్చినా తెలంగాణ ఆగదని.. బిల్లుపై అసెంబ్లీలో చర్చించని వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదన్నారు. కార్యక్రమానికి తెలంగాణ ఉద్యోగులు, అధికారుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాసులు అధ్యక్షత వహించగా.. ప్రధాన కార్యదర్శి పద్మాచారి, విమలక్క, నాయకులు లక్ష్మణ్, ప్రభాకర్, ప్రొఫెసర్ స్వామి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రెండు పాటలు రాశా..: డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన గద్దర్ తన ఆటపాటలతో సభికులను అలరించారు. ‘‘ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు పాటలు రాశా. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఆ పాటలను అందుకుంటా’’ అని చెప్పారు.