- కిరణ్, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసిన తెలంగాణవాదులు
- జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
- పలుచోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్,బీజేపీ నేతల ఆందోళనలు
వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై తెలంగాణవాదులు గురువారం భగ్గుమన్నారు. మౌనదీక్ష పేరుతో సీఎం ఢిల్లీలో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, చంద్రబాబు మరోసారి తెలంగాణపై విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ప్రజాసంఘాల నాయకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. అలాగే తెలంగాణ మహిళా మంత్రులు గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలను సీమాంధ్ర నాయకులు ఢిల్లీలో దౌర్జన్యానికి పాల్పడ్డారని జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాగా, సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తూ తెలంగాణను అడ్డుకుంటున్న సీఎం వైఖరిని నిరసిస్తూ న్యాయవాదులు హన్మకొండలోని జిల్లా పరిషత్, డీఈఓ కార్యాలయాల్లో ఉన్న ఆయన చిత్రపటాలను స్థానిక అమరవీరుల స్థూపం వద్దకు తీసుకొచ్చి దహనం చేశారు.
అలాగే హన్మకొండ అంబేద్కర్ సెంటర్‌లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం, సీమాంధ్ర నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దళిత మహిళా మంత్రి గీతారెడ్డిని, మరో మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని అవమానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాగా, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అణచివేస్తున్న చిత్తూరు నేతల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణను అడ్డుకుంటున్న సీఎం, బాబులకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహులపేట, జనగాామ, గూడూరు, కాజీపేటలో వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇప్పటికైనా కళ్లు తె రిచి రాష్ట్రం కోసం పోరాటాలు చేయాలని నాయకులు సూచించారు. కాగా, భూపాలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చిట్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీలకు చెందిన జిల్లా, మండల, స్థానిక నాయకులు పాల్గొన్నారు.