బిగ్‌బాస్‌–2 కౌశల్‌ మనోడే | Big Boss Telugu Winner kaushal manda From Visakhapatnam | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌–2 కౌశల్‌ మనోడే

Published Thu, Oct 4 2018 6:57 AM | Last Updated on Thu, Jul 18 2019 1:53 PM

Big Boss Telugu Winner kaushal manda From Visakhapatnam - Sakshi

బీహెచ్‌పీవీలో జరిగిన ఓ కార్యక్రమంలో కౌశల్‌ను సన్మానిస్తున్న స్థానికులు (ఫైల్‌)

విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్‌ షోతో ఒక్కసారిగా ఓవర్‌ నైట్‌స్టార్‌గా మారిపోయాడు బుల్లితెర నటుడు కౌశల్‌ మండ. ఈ షో ద్వారా ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన్ని అభిమానించే వాళ్లలో మహిళల శాతమే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. కౌశల్‌ ఆర్మీ పేరుతో అభిమానులు గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. బిగ్‌బాస్‌–2 విజేతగా కౌశల్‌ నిలవడంతో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ కౌశల్‌ ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. ఆయన మన విశాఖ వాసే. గాజువాక ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఆయన తండ్రి మండ సుందరయ్య బీహెచ్‌పీవీ విశ్రాంత ఉద్యోగి. కౌశల్‌ గెలుపులో గాజువాక ప్రాంత వాసుల భాగస్వామం ఉంది. కౌశల్‌తో తమకున్న జ్ఞాపకాలను ఆయన బాల్య స్నేహితులు, కుటుంబ సన్నిహితులు ‘సాక్షి’తో పంచుకున్నారు.

కౌశల్‌ తల్లిదండ్రులు లలిత కుమారి, సుందరయ్యలు గాజువాక ప్రాంతంలో నివసించేవారు. ఐదేళ్ల వయసులోనే కౌశల్‌ బెస్ట్‌ హెల్తీ బాయ్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నాడని సుందరయ్య తెలిపారు. బీహెచ్‌పీవీ కళావేదికపై కౌశల్‌ ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. బీహెచ్‌పీవీ పాఠశాలలోనే 10వ తరగతి, గాజువాక ప్రాంతంలోని కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. తర్వాత మెటలర్జీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ దశలోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడని కౌశల్‌ తండ్రి తెలిపారు. 2000లో సినీ రంగ ప్రవేశం చేసిన కౌశల్‌ ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడని వివరించారు. ప్రముఖ హీరోల సరసన నటించాడని, మూడు సినిమాల్లో ప్రధాన భూమిక వహించాడని చెప్పారు. పలు సీరియళ్లలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, మోడలింగ్‌ రంగంలో విశేషంగా రాణించాడని సుందరయ్య వివరించారు. కౌశల్‌ను సన్మానించేందుకు టౌన్‌షిప్‌ ప్రాంత వాసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కౌశల్‌ ఎంతో మందికి ప్రేరణ
కౌశల్‌ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చిన్నతనం నుంచి నటనలో రాణించాడు. నాటక, బుల్లి తెర, వెండితెరలో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌–2 విజేతగా అవతరించడం ఆనందంగా ఉంది. కౌశల్‌ నాకు బాల్య మిత్రుడు. ఆయనతో గడిపిన క్షణలు ఇప్పటికీ గుర్తున్నాయి.
– రాంజానే, షార్ట్‌ఫిల్మ్‌ మేకర్, భెల్‌ ఉద్యోగి

మంచి స్నేహితుడు కౌశల్‌
మంచి స్నేహితుడు కౌశల్‌. స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తాడు. కౌశల్‌ నగరానికి వచ్చిన ప్రతిసారి తమను కలుస్తాడు. ఆ రోజు మాకు పండగే. ప్రతి క్షణాన్ని పండగలా జరుపుకుంటాం. క్రికెట్, షటిల్‌ బ్యాడ్మింటన్‌ అంటే కౌశల్‌కు ఎంతో ఇష్టం.
– ప్రశాంత్, బాల్య స్నేహితుడు

నటన వారి కుటుంబంలోనే ఉంది
కౌశల్‌ తండ్రి సుందరయ్య బీహెచ్‌పీవీ ఉద్యోగిగా ఉన్న సమయంలో అసోసియేషన్‌ ఏర్పాటు చేసి నాటికలు వేసేవారు. కౌశల్‌ కూడా నటన రంగంలో రాణిస్తున్నాడు. అందివచ్చిన మంచి అవకాశాన్ని కౌశల్‌ సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పవచ్చు. కౌశల్‌ నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది.  
– శ్యాం, స్నేహితుడు

చెప్పలేనంత ఆనందంగా ఉంది
బీహెచ్‌పీవీ టౌన్‌షిప్‌లో మా అందరితో కలసి మెలసి తిరిగిన కౌశల్‌ ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఎంతో ఆనందంగా ఉంది. కౌశల్‌ కోసం బిగ్‌బాస్‌ షో క్రమం తప్పకుండా చూశాను. చాలా మంది ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఆయన ఇక్కడకు విచ్చేస్తే ఘన స్వాగతం పలుకుతాం.
– శ్రీదేవి, కౌశల్‌ కుటుంబ సన్నిహితురాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement