సాక్షి, ఒంగోలు టూటౌన్: జిల్లాలోని బీసీ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు బరితెగించారు. ఏకంగా రూ.50 లక్షలకు పైగా ఆదరణ పథకం సొమ్మును అప్పనంగా కాజేశారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు అందరూ కుమ్మక్కై భారీ కుంభకోణానికి తెరలేపారు. ఈ అవినీతికి గతంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన ఎ.నాగేశ్వరరావు సూత్రధారిగా పనిచేశారు. జిల్లా బీసీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను సూచాయగా సమాచారం తెలుసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారులు కార్పొరేషన్ (విజయవాడ) హెడ్ ఆఫీసు నుంచి డెవలప్‌మెంట్ ఆఫీసర్ జి.బీమా శంకరరావుని గత నెల 31న విచారణకు పంపారు. విచారణలో ఆదరణ సొమ్మను బొక్కేశారని తేలింది.
అనంతరం ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించారు. దీంతో సొమ్ము స్వాహా చేసేందుకు తోడ్పడిన ఉద్యోగులందరినీ తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తొలగించిన వారిలో ఆరుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వై. ఏడుకొండలు (జూనియర్ అసిస్టెంట్), వి.రాజేష్ (డేటా ఎంట్రీ ఆపరేటర్), బి.వై. కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్), సీనియర్ అసిస్టెంట్లు అయిన టి.జాహ్నవి, బి.గౌతమి, ఆఫీసు సబార్టినేట్ అయిన ఎస్‌కె జిలానీ ఉన్నారు. వీరంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడం గమనార్హం. వీరితో పాటు కార్యాలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈవో) ఎ.శ్రీనివాసరావుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సొమ్ము స్వాహాకు కీలక సూత్రదారి అయిన ఈడీ నాగేశ్వరరావు రెండు నెలల క్రితం బదిలీపై కృష్ణా జిల్లా మచిలీపట్నం బీసీ కార్పొరేషన్‌కు ఈడీగా వెళ్లారు.
వివరాల్లోకి వెళితే..
గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఆదరణ–2 పథకంను ప్రవేశపెట్టింది. ఈ ఆదరణ పథకంలో బీసీలకు వివిధ పనిముట్లను రాయితీ కింద అందించేందుకు చర్యలు చేపట్టింది. వృత్తిని బట్టి ఇస్త్రీ పెట్టెలు, సన్నాయి, మేళం, నాయీబ్రాహ్మణులకు కుర్చీలు, మత్స్యకారులకు పడవలు, ఇంకా చేతి పనిముట్లు అందిస్తున్నారు. బీసీల ఓట్ల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఆదరణ పథకం కింద విడుదల చేశారు. అయితే యూనిట్‌కు సంబంధించిన లబ్ధిదారుని వాటా ధనం రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారులు తమ వాటా ధనం సొమ్మును డీడీ రూపంలో బీసీ కార్పొరేషన్‌కు చెల్లించారు. దీనికి సంబంధించిన బీసీ కార్పొరేషన్ ఈడీ ఖాతా ఒంగోలు సిండికేట్ బ్యాంకులో ఉంది. ఈ సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది.
సొమ్ము స్వాహాకు పథకం ఇలా..
బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు ఒక్కడే డైరెక్ట్‌గా నగదు డ్రా చేయకుండా కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నాడు. మొత్తం 50 లక్షలకు పైగా నిధులను దొడ్డిదారిన మింగేసేందుకు వ్యూహం పన్నాడు. ఇందుకు కార్యాలయ ఏఈవో ఎ.శ్రీనివాసరావు పేరు మీద రూ.8.05,000, జూనియర్ అసిస్టెంట్ వై.ఏడుకొండలు పేరు మీద రూ.12,23,500, వి.రాజేష్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరు మీద రూ.8,40,000, బి.వై.కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరు మీద రూ.5,50,000, మరో ఇద్దరు ఇతరుల పేరుమీద రూ.1,24,500, ఇంకొక వ్యక్తి పేరుమీద రూ.95,000, డీబీసీడబ్లు్యవో కార్యాలయానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ పి.వి.ఆంజనేయులు పేరు మీద రూ.45,000, తన (ఈడీ)పేరు మీద 10,87, 500 లక్షల వరకు చెక్కుల రూపంలో బ్యాంకు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో తేల్చారు.
మొత్తం రూ.50,10,500 లక్షలను ఈడీ నాగేశ్వరరావు డ్రా చేశారు. డ్రా చేసిన నగదును కొంత ఆయా ఉద్యోగులకు ఇచ్చి మిగతా సొమ్ము ఈడీ నాగేశ్వరరావే స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు. వీరితో పాటు కార్యాలయంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించిన మహిళా సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు కార్యాలయ సబార్టినేట్ కూడా ఉన్నారు. వీరందరూ ఈడీ నాగేశ్వరరావు అవినీతి అక్రమాలకు సహకరించారన్న అభియోగం విచారణలో తేలింది. దీంతో మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం. రామారావు ఉత్తర్వులు జారీ చేశారు.
క్రిమినల్ కేసులకు చర్యలు..
బీసీ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణంలో భాగస్వాములైన రెగ్యులర్ ఉద్యోగి కార్యాలయ ఏఈవో శ్రీనివాసరావుని సస్పెండ్ చేశారు. ఇతనితోపాటు తొలగించిన ఆరుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఇందులో భాగస్వాములైన మరో ఇద్దరు బయట వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని ప్రస్తుత ఈడీ కె.నాగముని తెలిపారు. ఈడీ నాగేశ్వరరావుపై చర్యలకు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదరణ సొమ్ము స్వాహాపై పూర్తి స్థాయి విచారణ కోసం జేసీ షాన్‌మోహన్‌ను నియమిస్తూ కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచే కుంభకోణం...
బీసీ కార్పొరేషన్‌లోజరిగిన కుంభకోణం ఈ ఏడాది జనవరి నుంచి ఆదరణ పథకం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్మే కావడం గమనార్హం. గత ఈడీ నాగేశ్వరరావు ఇదే జిల్లాలో ఆరున్నరేళ్లుగా పని చేస్తున్నారు. ఆరు నెలలకే రూ.50 లక్షలకు పైగా దోచేస్తే.. గత ఆరేళ్లుగా ఎంత పెద్ద అవినీతికి తెరలేపి ఉంటాడోనని సందేహం ఉంది. ఇదిలా ఉంటే కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని తొలగించడంతో బీసీ కార్యాలయం వెలవెలబోతోంది. కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment