ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రను కాంక్షిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో పార్టీ శ్రేణులు పలుచోట్ల మోటారుబైక్ ర్యాలీలు నిర్వహించాయి. దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. 3 వేలకుపైగా మోటారు బైకులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం తాళ్లూరు మండలంలోని గుంటిగంగ భవాని ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ నిర్వాహకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆహ్వానించగా.. శివప్రసాదరెడ్డి తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకొని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయాలని వేడుకున్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా శివప్రసాదరెడ్డి మోటారుబైకు నడుపుతూ ర్యాలీకి ముందుభాగంలో నిలిచారు. ఆయన తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారునితో పాటు బైక్‌పై తిరుగుతూ నియోజకవర్గ మొత్తం పర్యటించి సమైక్యాంధ్ర ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటిగంగ వద్ద బయల్దేరిన ర్యాలీ గంగవరం, తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, దొనకొండ, కురిచేడు వరకు సాగింది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నివాళులర్పించారు.
కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పామూరుల్లో మోటారుబైకు ర్యాలీలు జరిగాయి. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాట అరుణమ్మ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర వాదులమంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు తీరా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయంలో మౌనం వహించడం దారుణమన్నారు. దీన్ని బట్టే వారి రెండు కళ్ల సిద్ధాంతం స్పష్టమవుతోందన్నారు.
యర్రగొండపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి సూరా సామిరంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు దప్పిలి రాజేంద్రప్రసాద్ తదితరులు సమైక్యాంధ్రకు సంఘీభావంగా జరిగిన మోటారు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మోటారు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఒక్కటే సమైక్యాంధ్రే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. చీమకుర్తిలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణి, చీమకుర్తి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు స్థానిక నేతలతో కలిసి మోటారు బైకు ర్యాలీ చేపట్టారు.
ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సమైక్య మోటారు బైకు ర్యాలీ ప్రారంభమైంది. నగరంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు సమైక్యాంధ్ర నినాదాలను హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు తదితరులు ర్యాలీకి అగ్రభాగంలో నిలిచారు. స్థానిక చర్చి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అని, త్వరలో జరిగే ఎన్నికల్లో ద్వంద్వ వైఖరిని పాటించే పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
సమైక్య హోరు
Published Sun, Jan 5 2014 4:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement