సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి త్వరలో కాంగ్రెసు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెసు పార్టీ తీరు ఆయన మనసును కలచివేసిందని, దీంతో ఆయన పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మాగుంట ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ మొండి వైఖరితో ఉండటంతో, నియోజకవ ర్గంలోని ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆయన పార్టీని వీడే అవకాశం ఉంది.
పార్లమెంటులో జరిగిన విషయాలను తెలుపుతూ శనివారం విలేకరులతో మాట్లాడిన మాగుంట, పార్టీ వీడుతున్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. కాంగ్రెసు తన వైఖరి మార్చుకోకపోతే, పార్టీ వీడే విషయం గురించి ఆలోచిస్తామని అన్నారు. అయితే ఆయన పార్టీ వీడేందుకు ఇది వరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ భూస్థాపితం అవుతుందని భావిస్తున్న ఆయన, పార్టీని వీడటంపై ఇది వరకే తన కుటుంబ సభ్యులతో చర్చించిన ట్లు సమాచారం. తన సన్నిహితులు నెల్లూరుకు రమ్మంటున్నారని, మరికొంత
మంది ఇక్కడ నుంచే పోటీ చేయాలని కోరుతున్నారని అన్న మాగుంట ఏ పార్టీకి వెళతారనే విషయాన్ని దాట వేశారు. ఏ వైపు మొగ్గు చూపుతున్నార నేది కూడా ఆయన స్పష్టం చేయలేదు.
అయితే కొంత కాలంగా ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, దీనికి ముహూర్తం కూడా ఈనెల 21వ తేదీన ఖరారు చేశారనే వదంతులు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించలేదు. మరికొందరు ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందిందని కూడా అంటున్నారు. ఇవేవీ కాదు ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మరి కొన్ని వదంతులు కూడా వచ్చాయి. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులను కలుసుకుని, వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
దీంతో పాటు చెన్నైలో ఉన్న ఆయన సన్నిహితులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ మారే అంశంపై విలేకరుల సమావేశంలో ఆయనను పలువురు పాత్రికేయులు గుచ్చి గుచ్చి అడిగినా, తాను కన్య్ఫూజన్‌లో ఉన్నానని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ దూతలు వచ్చిన సమయంలో కూడా ఆయన వారిని కలుసుకోని విషయం తెలిసిందే. మాగుంట పార్టీ వీడే తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెసుకు మాగుంట గుడ్‌బై?
Published Sun, Feb 16 2014 2:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement