దండుసూరగూడ గిరిజన గ్రామంలో వేలిముద్ర పడక పింఛన్ అందని వృద్ధులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
విజయనగరం, కురుపాం: ప్రభుత్వ వైఫల్యం వల్ల కురుపాం నియోజకవర్గంలో ఉన్న గిరిజన మండలాలకు చెందిన గిరి శిఖరాల్లో వృద్ధులకు, ప్రజలకు ప్రతి నెలా నిత్యావసర సరుకులు, పింఛన్లు అందడం లేదని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం గిరిజనుల పాలిట శాపంగా తయారైందని ఆరోపించారు. మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి లైంబో బయోమెట్రిక్‌లో తన వేలిముద్ర పడక ఈ నెల పింఛన్ అందదేమోనని మనస్తాపంతో ఇంటి వద్దే మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతి విషయమై ఆరా తీశారు. అదే గ్రామానికి చెందిన మూటక చంద్రి అనే వృద్ధ అంధ దివ్యాంగురాలు తనకు 21 నెలలుగా పింఛన్ అందడం లేదని ఎమ్మెల్యే వద్ద కన్నీటి పర్యాంతమయ్యారు.
వేలిముద్రలు పడక ఈ నెల పింఛన్ ఇవ్వలేదని మండంగి సుబ్బమ్మ, బిడ్డిక కేమి, కె.లచ్చిమి, బి.జమ్మయ్య అనే వృద్ధులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ గిరిజనుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. గిరిజనులు వేలి ముద్రలు పడక, నెట్‌వర్కు సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల పింఛన్లపై, రేషన్ బియ్యంపై ఆధారపడి అవి సమయానికి అందక పస్తులు కూడా ఉంటున్న వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, బయోమెట్రిక్ లేకుండా చర్యలు తీసుకొనేందుకు ఐటీడీఏ పీవోకు సమస్యలను విన్నవిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment