గుర్తుకొస్తున్నాయి..!
ఉత్సాహంగా బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: అరే భాయ్.. హౌ ఆర్ యూ.. వేర్ ఆర్ యూ నౌ.. అంటూ ఆత్మీయ పలకరింపులు! మనోడేం మారలేదు.. అంటూ ఆత్మీయ ఆలింగనాలు!! బిట్స్ పిలానీకి చెందిన వివిధ క్యాంపస్‌లలో చదువుకుని ఉన్నత స్థానాలను అలంకరించిన ప్రముఖలంతా కాసేపు స్టూడెంట్స్‌లా మారిపోయారు. నాటి కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. దీనికి బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ వేదికైంది. గతంలో బిట్స్ క్యాంపస్ (పిలానీ, గోవా, దుబాయ్, హైదరాబాద్)లలో చదువుకున్న వారంతా శుక్రవారం బిట్స్ పిలానీ, బిట్స్ అలేమ్నీ అసోసియేషన్ (బిట్సా) ఆధ్వర్యంలో జరిగిన బిట్స్ పిలానీ గ్లోబల్ మీట్‌కు (జీబీఎం-2014) హాజరయ్యారు.
వీరిలో కొందరు కంపెనీలకు సీఈవోలు అయితే.. మరికొందరు విదేశీ విశ్వ విద్యాయాల్లో ప్రొఫెసర్లు.. ఇంకొందరు ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రావు, హిటాచీ కంపెనీ ఆసియా ఛైర్మన్ సలహాదారు రాజురెడ్డి, ఎస్‌క్యూఎల్ స్టార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ ఫార్మర్ చైర్మన్ అశోక్‌కుమార్ అగర్వాల్, జనరల్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసిన కృష్ణ వావిలాల, విశాఖపట్నం షిప్‌యార్డ్‌లో క్వాలిటీ డివిజన్ మేనేజర్‌గా చేసిన ఎస్వీ రమణయ్య ఇలా అనేక జీబీఎంకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బిట్సా చైర్మన్ రాజురెడ్డి తెలిపారు.