-
వైనతేయ పుష్కరఘాట్‌లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
-
పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు 1983–83 బ్యాచ్ భేటీ
పి.గన్నవరం :
వారంతా నూనూగు మీసాలు, పరికిణీ, ఓణీల ప్రాయంలో విడిపోయిన వారు. యవ్వనం గడిచి, నడివయసు నడుస్తున్న వేళ తిరిగి వైనతేయ తీరంలో కలుసుకున్నారు. నేటి సమాజంలో తమ స్థానాలనూ, హోదాలనూ గడ్డిపరకల్లా పక్కకు నెట్టి నాటి చనువుతోనే పలకరించుకున్నారు. మూడు దశాబ్దాల కిందటి తమ అనుభవాలనూ, అనుభూతులనూ కలబోసుకున్నారు. నాటి చిలిపిపనులనూ, కొంటె పనులనూ ప్రేమగా గుర్తు చేసుకున్నారు. శిఖరాల నుంచి దుమికే జలపాతాల వంటి; బండరాళ్లను ఢీకొని ఉరకలేసే కొండవాగుల వంటి ఆనాటి తమను ఆ నది అలల్లో దర్శించుకున్నారు. మనసులు తిరిగి ఆ తరుణయవ్వనంలో కాలిడగా.. కాల ప్రవాహానికి ఎదురీది.. దాని ప్రభావం దేహంపైనే తప్ప హృదయం మీద కాదని రుజువు చేసుకున్నారు.
పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు 1983–84 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఇక్కడి పాత అక్విడెక్టు పుష్కర ఘాట్ వేదికగా జరిగింది. 32 ఏళ్ల కిందట విడిపోయిన వారిలో అనేకులు ఉద్యోగ, వ్యాపార తదితర కారణాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాగా వారిలో స్థానికంగా ఉన్న కొందరు రెండు నెలలు శ్రమించి నాటి సహాధ్యాయుల చిరునామాలు సేకరించి ఆహ్వానాలు పంపగా 60 మంది హాజరయ్యారు. ఆ నాటి ముచ్చట్లను కలబోసుకుని మురిసిపోయారు. ఇంటిపేర్లతో పిలుచుకుంటూ చిన్నపిల్లల్లా మారిపోయారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఒకరి చిరునామాలు, సెల్ నెంబర్లు మరొకరు తీసుకున్నారు. నాడు తమకు చదువుచెప్పిన గురువులను వచ్చే ఏడాది జనవరిలో సత్కరించాలని, ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. తమ బ్యాచ్‌లో అకాలంగా మరణించిన కొందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం బస్సులు, కార్లలో దిండి చేరుకుని ‘గెట్ టు గెదర్’ కేకును కట్ చేశారు. అక్కడ నుంచి అంతర్వేది యాత్రకు తరలివెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు అన్నాబత్తుల అనుబాబు, వాసంశెట్టి కుమార్, నేలపూడి సత్యనారాయణ, మానేపల్లి వెంకటేశ్వరరావు, సుంకర శ్రీను, వరిగేటి పద్మావతి, మొల్లా షేరా, పైడి బుజ్జి, కొండా వెంకటేశ్వరరావు, యడ్లపల్లి వెంకటేశ్వర రావు, కూనపరెడ్డి వెంకటేశ్వర రావు, పీవీఎస్ ప్రసాద్, కట్టా లక్ష్మీ బంగారం, వంకాయల రజని, అడబాల అలివేణి తదితరులు పాల్గొన్నారు.
కేరళ నుంచి వచ్చా..
పదో తరగతి వరకూ ఇక్కడే చదివాను. కేరళలో స్థిరపడ్డాను. మా టెన్త్ బ్యాచ్ సమావేశమవుతుందని తెలుసుకుని మూడు రోజులు లీవు తీసుకుని వచ్చా. చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి.
నారాయణ విజయలక్ష్మి, కేరళ
బాల్యం గుర్తుకొచ్చింది..
మేమంతా మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందం కలిగించింది. బాల్యం గురుక్తు వచ్చింది. ఉద్యోగ బాధ్యతల్లో క్షణం తీరికలేకుండా ఉండే నాకు గత స్మృతులు గుర్తుకు వచ్చాయి.
అంబటి అనంతలక్ష్మి, ఏపీ ట్రాన్స్‌కో ఏఓ, హైదరాబాద్
గ్రామానికి సేవ చేయాలి..
ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సేవలందించాలి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సాయపడాలి. పూర్వ విద్యార్థులు కలిసినపుడల్లా గుర్తుగా గ్రామానికి ఏదో ఒక మంచిపని చేయాలి.
పి.వాలెంటీనా, హిందీ టీచర్, రాజమండ్రి
పేదస్నేహితులకు చేయూతనివ్వాలి..
కలిసి చదువుకున్న వాళ్లమంతా ఇలా తిరిగి కలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి చోటా జరగాలి. పేదరికంలో ఉన్న స్నేహితులకు ఉన్నతస్థితిలో ఉన్నవారు సహాయ పడాలి.
–చింతపల్లి సుజాత, హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూలు, అంతర్వేదిపాలెం
ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
మా బ్యాచ్ విద్యార్థులంతా కలిసి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. వచ్చే జనవరిలో కుటుంబాలతో సహా హాజరై, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. బాల్యమిత్రులను కలవడం ఆనందంగా ఉంది.
–మానేపల్లి వెంకటేశ్వరరావు, పాలకొల్లు