
సాక్షి, విశాఖపట్నం: పోల్ మేనేజ్‌మెంట్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు నెంబర్‌వన్ అని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓటును రూ.10వేలకు కొంటున్నారని గంటా స్నేహితులే తనతో చెపుతున్నట్లు ఆయన ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి ఇక్కడ పోటీస్తున్నారని, గంటా శ్రీనివాసరావు విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని విమర్శించారు. బూత్ కమిటీల్లో అన్ని రాజకీయల పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీని ఓడిండమే తన లక్ష్యమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి గంటా శ్రీనివాసరావు దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. అవినీతికి మరోరూపం గంటా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.