గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ హాజరైన యువభేరి కార్యక్రమానికి జిల్లా నుంచి దాదాపు 20 వేల మందికి పైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆదివారం తరలివెళ్లారు.
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ హాజరైన యువభేరి కార్యక్రమానికి జిల్లా నుంచి దాదాపు 20 వేల మందికి పైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆదివారం తరలివెళ్లారు. హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన యువభేరి సభకు ఆదిలాబాద్ నుంచి పలు ప్రత్యేక వాహనాల్లో వందల సంఖ్యలో ప్రజలను ఆ పార్టీ నాయకులు తరలించారు. కార్యక్రమానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, నాయకులు జనగం సంతోష్, మటోలియ, గందే కృష్ణకుమార్, విజయ్‌కుమార్, గన్నోజి కృష్ణకుమార్, వేణుగోపాల్, జోగు రవి, సురేష్‌జోషి, నారాయణరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు.
అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రులు కుంభకోణాల్లో కూరుకపోయి అవినీతిమయంగా మారుతున్నారని ఆరోపించారు. 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోడీని ప్రజలు పీఎంగా చూడాలనుకుంటున్నారని పేర్కొన్నారు. నిర్మల్, ఖానాపూర్ నుంచి జిల్లా నాయకులు, కార్యకర్తలు సుమారు 12వేల మంది తరలివెళ్లారు. భైంసా నుంచి మోడీ సభకు జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో 2వేల మంది కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లారు