
‘వికసిత్ భారత్’లక్ష్యం కోసం కృషి చేస్తానన్న మోదీ
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యే వరకు మరింత దీక్షతో, అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంతో సాధించినా చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రజా ప్రస్థానంలో సోమవారంతో 23 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న మోదీ సోమవారం ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టారు. ప్రభుత్వాధిపతిగా తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా, 23 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీని బీజేపీ ప్రశంసల్లో ముంచెత్తింది. ‘ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ప్రజా జీవితానికి నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రజా సేవ ప్రయాణం ఒక వ్యక్తి తన జీవితాంతం దేశం, ప్రజల సంక్షేమం కోసం ఎలా అంకితం చేయగలడనే అపూర్వ అంకితభావానికి, సజీవ చిహ్నం’అని హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ మొట్టమొదటిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టక మునుపు సీఎం పోస్టులో 13 ఏళ్లపాటు కొనసాగారు. ఈ ఏడాది జూన్‌లో మూడో విడత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment