బీజేపీ హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు
► పదేళ్లు ప్రత్యేక హోదా
► కల్పిస్తామని చెప్పి మాటమార్చారు
► మినీ మహానాడులో బీజేపీపై టీడీపీ నేతల ఫైర్
నెల్లూరు, సిటీ / నెల్లూరు టౌన్: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, కృష్ణపట్నం, దుగరాజపట్నం ఓడరేవుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమనీ, ఈ విషయంలో ప్రధాని మోదీ నెల్లూరులో ఇచ్చిన హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. కస్తూరీదేవిగార్డెన్స్‌లో సోమవారం నెల్లూరు జిల్లా మినీమహానాడు జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభలో మాట్లాడిన తీరు దారుణమన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ విశాఖ చట్టంలో చేసినా ఇవ్వలేదనీ, దుగ్గరాజుపట్నం ఓడరేవు చట్టంలో ఉన్నా, రెండేళ్లు గడిచినా ఆ విషయంపై కేంద్రం మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు.
కేంద్రం అందించిన సహాయంపై బీజేపీ నాయకులు కాకి లెక్కలు చెబుతున్నారని టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. హైదరాబాద్ 2.5 లక్షల ఎకరాల్లో ఉందనీ. ఆ స్థాయి రాజధాని అభివృద్ధి చెందాలంటే రూ.10లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల ఏర్పాటుకు ఇచ్చింది ’135 కోట్లేననీ రాష్ట్ర ప్రభుత్వం మౌలికసదుపాయాల కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం కేంద్రం రూ.765 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 44 లక్షల మందికి రూ.6 వేల కోట్లు ఇస్తోందన్నారు. పోలవరానికి రూ.2,800 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటివరకు కేంద్రం రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. నెల్లూరు కొండాయపాళెం జాతీయరహదారిపై ఏర్పాటు చేయనున్న టోల్‌గేట్ నిర్మాణాన్ని నిలిపివేసి సున్నపుబట్టి ప్రాంతంలో ఉన్న టోల్‌గేట్ ద్వారా అదనపు చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించామని మంత్రి శిద్దా రాఘవరావె చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేందుకు నీరు - చెట్టు, నీరు - ప్రగతి, ఇంకుడు గుంతలు కార్యక్రమాలను చేపట్టి ఫలితాలను సాధించిందన్నారు.
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామిక హబ్ రాబోతున్నాయన్నారు. కండలేరు డ్యాం పక్కనే ఉన్నా మా నియోజక వర్గం రైతులకు సరిగా నీరు అందడంలేదని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చెప్పారు. మంత్రి నారాయణ రైతులకు సరిపడా నీరు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో నెల్లూరు పారిశ్రామిక హబ్‌గా ఏర్పడనుందని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవాలని రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కిలారి వెంకట స్వామి నాయుడు కోరారు. జన్మభూమి కమిటీలను తొలగిస్తే ఒప్పుకోమని మాజీ మంత్రి దుర్గా ప్రసాద్ హెచ్చరించారు. కార్యక ర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. పార్టీలో సమస్యలు ఉన్నా సర్దుకు పోవాల్సిందే, కలసి పనిచేయాల్సిందేనని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర చెప్పారు.
ఎమ్మెల్యే పాశం సునీల్, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ అజీజ్, మాజీ మంత్రులు రమేష్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రమణ్యం, ముంగమూరు శ్రీధర్‌కష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, బీదమస్తాన్‌రావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ పరిశీలకులు గుంటుపల్లి నాగేశ్వరరావు, గూటూరు కన్నబాబు, ఆనం జయకుమార్‌రెడ్డి, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు శైలజ, రాష్ర్ట పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిలా అధ్యక్షుడు తిరుమలనాయుడు పాల్గొన్నారు.