
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలు సహాయ సంస్థలు, ఛారిటీ సంస్థల ద్వారా నిర్వహించబడే రక్తదాన కార్యక్రమాల్లో చాలామంది పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి సమూహాల వల్ల వైరస్ వ్యాప్తి పెరగొచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో లాక్‌డౌన్ ముగిసే వరకు వీటిపై నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. (విద్యార్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్)
అయితే నిత్యం రక్తమార్పిడి అవసరమైన తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే రోగుల అవసరాలు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొంత వెసులుబాటును కల్పించింది. రోగుల రక్త మార్పిడి, చికిత్స కొరకు సంబంధిత ఆస్పత్రికి వెళ్లడానికి ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను పరిశీలించి అధికారులు తగిన చర్యలను చేపట్టనున్నారు. ప్రయాణం అనుమతి కోసం రక్త మార్పిడి అవసరం ఉందంటూ తెలిపే ఆధారాలు పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. వాటిని పోలీసు అధికారులు పరిశీలించి రెగ్యులర్‌గా ఆసుపత్రులను సందర్శించేందుకు వీలుగా వారికి పాసులను జారీ చేస్తారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తిని కొంతమేర కట్టడి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment