నేటి నుంచి రెండో విడత సమైక్య శంఖారావం
=రెండు కుటుంబాలకు ఓదార్పు
=భారీ స్వాగత ఏర్పాట్లు
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండవ విడత సమైక్య శంఖారావం జిల్లాలో శుక్రవారం ప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి ఉదయం పలమనేరు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చేరుకునే ఆయనకు జంగాలపల్లె వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. పలమనేరు నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయనకు పలు ప్రాంతాల్లో స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పార్టీ పతాకాలను ఏర్పాటు చేశారు.
వీరితో పాటు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకనున్నారు. నాలుగు రోడ్ల వద్ద మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. సభకు హాజరయ్యేందుకు పలమనేరు నుంచే కాకుండా సరిహద్దు నియోజకవర్గాలైన చిత్తూరు, పుంగనూరు లాంటి ప్రాంతాల నుంచి అభిమానులు చేరుకుంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో గత నెల 29వ తేదీన తొలివిడత సమైక్య శంఖారావం ప్రారంభించిన విషయం తెలిసిందే.
సమైక్య శంఖారావానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఆ యాత్ర పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లెలో ముగిసింది. రెండవ విడత యాత్ర అదే నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. పలమనేరు, పుంగనూరు నుంచి మదనపల్లి వరకు ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.
సమైక్య శంఖారావంతో పాటు, వైఎస్.రాజశేఖరరెడ్డి మరణించడాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చుతారు. పలమనేరు నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చనున్నారు. రెండవ విడత సమైక్య శంఖారావంలో నాలుగురోడ్ల జంక్షన్ వద్ద బహిరంగ సభ ముగించుకుని, పత్తికొండ, మామడుగు, ఆర్‌టీఏ చెక్‌పోస్టు, నక్కపల్లి, కొలమాసన పల్లి, శంకర్రాయలపేట, అప్పినపల్లి, పెద్దవెలగటూరులలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారు. ఈ కార్యక్రమాలతో పాటు వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.