కోచింగ్‌ సెంటర్ల మాయాజాలం | Bogus Coaching Centres In City | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్ల మాయాజాలం

Mar 21 2018 11:57 AM | Updated on Apr 3 2019 5:51 PM

టెట్, డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఆయా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టెట్‌ ర్యాంక్‌లే పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్న సంస్థల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. టెట్‌లో రాని ర్యాంక్‌లు వచ్చాయని ప్రకటిస్తూ పక్క సంస్థ అభ్యర్థులు  తమవారంటూ ప్రకటనలిస్తూ కొన్ని కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

నెల్లూరు(టౌన్‌): జిల్లాలోని కొన్ని కోచింగ్‌ సెంటర్ల బోగస్‌ ర్యాంకుల ప్రకటనలు చూసి డీఎస్సీ కోచింగ్‌కు ఏ సంస్థలో చేరాలో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగం నుంచి ఐఏఎస్‌ వరకు పోటీతత్వం పెరిగింది. ఈ నేథ్యంలో మంచి కళాశాల, కోచింగ్‌ సెంటర్‌ తదితర వాటిలో చేరేందుకు విద్యార్థులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

బోగస్‌ ర్యాంకులు
ఆయా  కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు బోగస్‌ ర్యాంక్‌లు ప్రకటించి ఆర్భాటం చేస్తున్నారు. అభ్యర్థి హాల్‌టికెట్, ఫొటో అడిగితే ముఖం చాటేస్తున్నారు. తాజాగా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌)లో ఇదే తంతు సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ  తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఐదు విడతల్లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20,093 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. సోమవారం ప్రకటించిన టెట్‌ ఫలితాల్లో కొన్ని కోచింగ్‌ సెంటర్లు 100శాతం ఫలితాలు సాధిం చాయని ప్రకటిస్తే, మరికొన్ని 98శాతం, 95శాతం పైగా ఫలితాలు వచ్చాయని ప్రకటించాయి. టెట్‌లో అత్యధిక మార్కులు తమకే వచ్చాయని ప్రకటించిన ఓ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడిని వివరాలు అడిగితే ముఖం చాటేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ టెట్‌ ఫలితాల్లో స్పష్టత రాలేదు. జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఎంత, అ«త్యధిక మార్కులు ఎన్ని అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హడావుడిగా టెట్‌ ఫలి తాలను ప్రకటించి డీఎస్సీకి కోచింగ్‌ ఇస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

భారీగా ఫీజు వసూలు
టెట్, డీఎస్సీకి కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజు వసూళ్లు చేస్తున్నారు. రూ.12వేల నుంచి రూ.18వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు నెలలపాటు కోచింగ్‌ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఎక్కువ మంది అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధించకుంటే డబ్బులు వృథా అనే కారణంగా కేవలం టెట్‌కు ఫీజు చెల్లించారు. వారి దగ్గర నుంచి కూడా రూ. 8వేల నుంచి రూ.10 వేల వరకు ఫీజు వసూలు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ మరో వారంలో వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు కోచింగ్‌ చేరేందుకు ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కోచింగ్‌ సెం టర్ల నిర్వాహకులు ఆమాంతంగా ఫీజులు పెంచేశారు. ఒక్క డీఎస్సీకి కో చింగ్‌ ఇచ్చినందుకు కోచింగ్‌ సెంటర్‌ను బట్టి రూ.10వేల నుంచి రూ.12వేల వరకు వ సూలు చేస్తున్నారు. బోగస్‌ ర్యాంక్‌ల ప్రకటనతో ఓ వైపు టెట్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చిన సంస్థలు నష్టపోవడం, మరోవైపు సరైన ఫ్యాకల్టీ లేని కోచింగ్‌ సెంటర్లలో చేరి అభ్యర్థులు మోసపోతున్నారు.

 పోటీ పరీక్షల్లోనూ ఇదే పరిస్థితి
పోటీ పరీక్షల్లో ఉద్యోగం గ్యారెంటీ పేరుతో జిల్లాలో పుట్టగొడుగుల్లా పలు కోచింగ్‌ సెంటర్లు వెలిశాయి. బ్యాంక్‌లు, ఎస్సై, కానిస్టేబుల్, గ్రూపు పోటీ పరీక్షలు, ఆఫీసర్స్, సీఏ తదితర పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సంస్థలు రాని ర్యాంక్‌లను ప్రకటించడం, మరికొన్ని పక్క రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంక్‌లను ప్రకటించి అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా సంస్థల్లో చేరిన అభ్యర్థులకు ఉద్యోగాలు రాక ఆం దోళనకు గురవుతున్న సందర్భాలున్నాయి.

నియంత్రణ లేక పోవడమే..
కోచింగ్‌ సెంటర్లపై నియంత్రణ లేకపోవడంతో కొంతమంది నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పదోతరగతి వరకు స్కూల్‌ ఎడ్యుకేషన్, ఇంటర్‌కు ఇంటర్మీడియట్‌ బోర్డు, డిగ్రీకి యూనివర్సిటీలు కంట్రోలు చేస్తున్నాయి. అవి విధించిన నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. అయితే కోచింగ్‌ సెంటర్లపై ఈ నియంత్రణ లేదు. ఎవరి ఇష్టారాజ్యం వారిదే అన్నట్టుగా సాగుతోంది. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ కళాశాలల మాదిరిగానే కోచింగ్‌ సెంటర్లకు నియంత్రణ ఉండాలి. బోగస్‌ ఫలితాలు ప్రకటించిన మాత్రాన ఫలితం ఉండదు. ఏది మంచి సంస్థ అని అభ్యర్థులు గమనిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement