ఎస్పీవెరైడ్డి.. ఇన్నాళ్లు అధికార పార్టీలో లేరా?
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్లు అధికార పార్టీలో కొనసాగి ఏమీ అభివృద్ధి చేశారో ప్రజలకు వివరిస్తావా అంటూ రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎంపీ ఎస్పీవెరైడ్డిని ప్రశ్నించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో రైతు సంఘం నాయకుడు రామచంద్రారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు రాజునాయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
వైఎస్సార్సీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలుపొంది ప్రమాణస్వీకారం చేయకముందే నంద్యాల అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు చెప్పడం ఆయన దగాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. వ్యాపారాల కోసమే పదవిని తాకట్టు పెట్టాడని దశరథరామిరెడ్డి నిప్పులు చెరిగారు. గెలుపొందిన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వ్యాపారం చేసుకోవాలని ఎస్పీవెరైడ్డికి సూచించారు. గతంలో అధికార పార్టీలో కొనసాగి రైతులకు ఏం చేశారో వివరించాలని క్రింది ప్రశ్నలను సంధించారు.
పదేళ్లుగా ఎంపీగా అధికార పార్టీలో కొనసాగుతూ 2009 నుంచి 2014 వరకు నేషనల్ వాటర్ రిసోర్స్ స్టాండింగ్ కమిటీలో మెంబర్‌గా ఉండి నంద్యాల పార్లమెంట్‌కు చేసిన అభివృద్ధి ఏమిటి?
స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా శ్రీశైలం రిజర్వాయర్‌ను ఎన్ని సార్లు సందర్శించారు.. ఒకవేళ సందర్శించి ఉంటే రిజర్వాయర్ అభివృద్ధికి మీరు చేసిన ప్రతిపాదనలు?
2009లో రిజర్వాయర్‌పై వరదనీరు ఉప్పొంగితే దాని రక్షణకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారో తెలియజేయాలి?
నంద్యాల పార్లమెంట్‌లో గుండెకాయ లాంటి కేసీ కెనాల్ ప్రాజెక్టు స్థిరీకరణ కోసం ఏం పోరాటం చేశారు. ఏదైనా ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపారా?
కేసీ కెనాల్ స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్ కో సం తుంగభద్ర హక్కుల కమిటీ పోరాటం చేసి ప్రాజెక్టును సాధిస్తే మీరు ఇచ్చిన సహకారం ఏమిటి?
జిల్లా ఎంపీగా కర్నూలును రాజధానిగా ప్రకటించాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తో ఏమైనా హామీ పొందారా? అని బొజ్జా ప్రశ్నించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు