హ్యాట్రిక్ దారిలో ఎస్పీవై రెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవెరైడ్డి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో రెండు సార్లు పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈ సారి కూడా భారీ మెజార్టీ సాధించి హ్యాట్రిక్ వీరుల జాబితాలో చేరుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీవెరైడ్డికి కనీసం 30 వేలకు పైగానే మెజార్టీ లభించవచ్చని అంచనా వేస్తున్నాయి. టీడీపీలో మాత్రం గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టేనని ఆయన అనుచరులు పేర్కొంటున్నా గెలిచే అవకాశాలు లేవని కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకోవడం గమనార్హం. ఫరూక్ రెండోసారి నంద్యాల పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సారి ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయకూడదనుకున్నా పార్టీ బలవంతం మేరకు బరిలో నిలిచారు.
అయితే ఏడు నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులు ఆయనను నట్టేట ముంచారనే గుసగుసలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నంద్యాల, డోన్, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఫరూక్ పేరును ప్రతిపాదించారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండటంతో తాము లబ్ధి పొందవచ్చని అంచనాతో ఫరూక్‌ను ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి డబ్బులు రాబట్టుకోవడం మినహాయిస్తే ఆయనకు ఏ మాత్రం సహకరించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆ తర్వాత పార్లమెంట్‌కు మీ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోవాలని ఓటర్లను టీడీపీ అభ్యర్థులే కోరినట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఫరూక్ దృష్టికి కూడా వెళ్లింది. అయితే ఈనెల 16వ తేదీ లెక్కింపు వరకు ఏ మాత్రం నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఫరూక్ అనుచరులు భావిస్తున్నారు. నంద్యాలతో సహా అనేక నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చే ఓట్లతో పోల్చితే ఫరూక్ తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి మరోసారి కూడా నంద్యాల పార్లమెంట్ దక్కే అవకాశం లేదని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునే నాథుడే కరువయ్యారు. ఏ నియోజకవర్గంలో కూడా మూడో స్థానం నుంచి రెండో స్థానంలో ఓట్లు పోలయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటును వినియోగించుకోని వారు
3.79లక్షలు: పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3,79,964 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. పురుషులు 5,97,330మంది, మహిళలు 5,98,366మంది ఓటును వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 1036మంది అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.