
ఘటనలో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లు ,మందుపాతర పేలుడు ధాటికి నిర్మాణంలో ఉన్న బిడ్జి వద్ద ఏర్పడిన గొయ్యి
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసులకు మద్ధ సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం అలజడి రేపుతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన నాటి నుంచి కూంబింగ్ నిరంతరం కొనసాగుతోంది. దళసభ్యుల గాలింపులో భాగంగా భద్రత బలగాలు ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. పోలీసులపై దాడికి మావోయిస్టులు కూడా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య సాగుతున్న వార్‌తో మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. కూంబిం గ్‌కు వెళ్లి వస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని రెండు మందుపాతరలను జి.మాడుగుల మండలం నుర్మతి ఔట్ పోస్టుకు అతి సమీపంలో బుధవారం ఉదయం దళసభ్యులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు, బైకుపై వెళుతున్న ఒక పౌరునికి గాయాలయ్యాయి. మందుపాతరలు కొంచెం ముందుగా పేలడంతో పోలీసులకు పెనుముప్పు తప్పినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం, పాడేరు/జి.మాడుగుల : పోలీస్ ఔట్‌పోస్టుకు సమీపంలో మందుపాతరలు పేల్చడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన సుమారు 30 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు కొండదిగి నుర్మతి పంచాయతీ గాదిగుంట రోడ్డులో కాలినడకన వస్తుండగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన జగదీష్, ఆనంద్‌లతో పాటు అటుగా బైక్‌పై వస్తున్న డిప్పలగొంది గ్రామానికి చెందిన గిరిజనుడు సన్యాసిరావుకు గాయాలయ్యాయి. నుర్మతి పంచాయతీ గాదిగుంట–తిప్పలగొంది గ్రామాల మధ్య వండ్రుంగుల వద్ద కొత్తగా నిర్మించిన మట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో రెండు చోట్ల అమర్చిన క్యారేజి మందుపాతరలను పేల్చారు. రెండూ ఒకేసారి పేలడంతో ముందుగా నడుస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, కాస్తా వెనుకన ఉన్న పోలీసులు కొండపైకి వెనుదిరిగి తప్పించుకున్నారు. వెంటనే ఎదురుకాల్పులు చేపట్టారు. మావోయిస్టుల గురి తప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన పోలీస్‌లను జి.మాడుగుల స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి పాడేరు ఆస్పత్రికి.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలించారు.
ప్రతీకారంతోనే..
ఏవోబీలోని రాంగుడ ఎన్‌కౌంటర్‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవడం, ఇటీవల మహిళా మావోయిస్టును పోలీస్‌లు ఎన్‌కౌంటర్ చేయడం, ఇన్‌ఫార్మర్లు పేరుతో గిరిజనులను అరెస్టు చేయాన్ని దళసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రగిలిపోతున్న వీరు ప్రతీకారంగా అదును చూసి దెబ్బకొట్టడానికి యత్నిస్తున్నట్టు ఈ ఘటనతో అర్థమవుతోంది. మన్యంలో ఔట్‌పోస్టుల ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీటిని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ప్రకటనలు ద్వారా డిమాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. నుర్మతి గెడ్డకు కాలకృత్యాలకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపి చంపడం, మద్దిగరువులో ఔట్‌పోస్టుపై కాల్పులతో నుర్మతి, మద్దిగరువు ఔట్‌పోస్టులను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద అన్నవరం పోలీస్‌లు వస్తున్న జీపు లక్ష్యంగామందుపాతరలు పేల్చడంతో కానిస్టేబుల్‌ను మృతి చెందిన సంఘటన తెలిసిందే. నుర్మతి, దాని పరిసర ప్రాంతాల్లో 8నెలలు క్రితం బీబీఎన్‌ఎల్ పనులు చేస్తున్న నాలుగు పొక్లెయిన్‌లను మావోయిస్టులు ధ్వంసం చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లు పేరుతో మండలంలోని బొయితిలి పంచాయతీ మద్దిగరువుకు చెందిన సూర్యం, కిశోర్‌లను 2017 సెప్టెంబర్12న తుపాకీతో కాల్చిచంపారు. పార్టీ అగ్రనేతలు కోల్పోతుండడంతో పోలీస్‌లపై మందుపాతర దాడులకు దళసభ్యులు పాల్పడుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది.
గాయపడిన వారికి విశాఖలో చికిత్స
విశాఖ క్రైం: మందుపాతర పేలుడులో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నపాటిì గాయాలు కావడంతో వారికి ఎటువంటి ప్రాణపాయాంలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment