మండే ఎండల్లో విద్యార్థులు..ఉక్కిరిబిక్కిరి
- పాఠశాలల నిర్వహణపై తల్లిదండ్రుల ఆగ్రహం
- ఇతర జిల్లాల్లో సెలవులు ఇచ్చినా ఇక్కడ ఒంటిపూట బడులు
- అర్ధరాత్రి అధికారుల అనాలోచిత ప్రకటనలు
ఒకవైపు ఎండ తీవ్రత.. మరోవైపు అధికారుల మొక్కుబడి నిర్ణయాలు జిల్లాలోని లక్షలాది మంది చిన్నారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పక్క జిల్లాల్లో సెలవులు ఇచ్చినా మన అధికారులు మాత్రం ఒంటిపూట బడులు నిర్వహించాలని తీరిగ్గా అర్ధరాత్రిళ్లు ప్రకటిస్తున్నారు. ఇది తెలియని పిల్లలు ఉదయం పాఠశాలలకు వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
మచిలీపట్నం :అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మొక్కుబడి నిర్ణయాలు పిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నుంచి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయంపై విద్యాశాఖాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయిస్తున్నారు. ఈ సమాచారం సకాలంలో అందక ఉదయం పాఠశాలలకు వెళ్లిన పిల్లలు ఎండలోనే ఇంటిబాట పడుతున్నారు. ప్రయివేటు పాఠశాలల మాత్రం తమ ఇష్టానుసారంగా రెండు పూటలా పాఠశాలలను నిర్వ హిస్తున్నాయి.
ఎవరి ఇష్టం వారిదే...
జిల్లాలో 3,200 ప్రభుత్వ పాఠశాలలు, 1,200లకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సాధారణంగా జూన్ నెల రెండో వారంలో వాతావరణం చల్లబడుతుంది. దీంతో పాఠశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉండటంతో పాఠశాలల నిర్వహణ కష్టంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు పాఠశాల విద్యా కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు.
దీంతో పాఠశాల విద్యా కమిషనర్ జిల్లాలో వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యశాఖ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు సెలవు ప్రకటించవచ్చని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆయా జిల్లాల కన్నా మన జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా విద్యాశాఖ అధికారులు ఒంటిపూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి నుంచి ఎప్పటికప్పుడే నిర్ణయాలు..
జిల్లాలో గత వారం రోజులుగా 40 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం కాగా.. పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని 13న సెలవు ప్రకటించారు. 14వ తేదీ రెండో శనివారం, 15 ఆదివారం కావడంతో సెలవులు వచ్చాయి. 16వ తేదీ యథావిధిగా పాఠశాలలు కొనసాగించగా, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 17 నుంచి 21వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించారు.
మళ్లీ 23, 24 తేదీల్లో కూడా ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు మాత్రమే అధికారులు ప్రకటించారు. అయితే 25వ తేదీ కూడా ఒంటి పూట బడి నిర్వహించాలని 24 రాత్రి పది గంటల సమయంలో విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. ఈ సమాచారం విద్యార్థులకు తెలియకపోటవంతో వారు మామూలుగానే పాఠశాలకు వచ్చారు. దీంతో మధ్యాహ్నం ఎండలోనే చిన్నారులు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరిన్ని కష్టాలు
జిల్లా వ్యాప్తంగా 450కు పైగా ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలకు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. వీరు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాల వదిలిన అనంతరం ఇళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండకు, వడగాడ్పులు వీస్తున్న సమయంలో పిల్లలు ఇంటికి చేరుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సౌలభ్యంగా ఉండే నిర్ణయం తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.