బొమ్మాడిస్తున్న ‘బొమ్మరిల్లు’ | Bommarillu Finance and real estate Victims Complaints | Sakshi
Sakshi News home page

బొమ్మాడిస్తున్న ‘బొమ్మరిల్లు’

Published Thu, Jan 23 2014 6:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

బొమ్మాడిస్తున్న ‘బొమ్మరిల్లు’

బొమ్మాడిస్తున్న ‘బొమ్మరిల్లు’

విశాఖపట్నం: ‘బొమ్మరిల్లు’ చేతుల్లో దారుణంగా మోసపోయిన బాధితులు ఫిర్యాదులు చేయడానికి పోలీస్‌స్టేషన్ల వద్ద క్యూలు కడుతున్నారు. సంస్థ దివాలా తీసిన నేపథ్యంలో ఆ సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ ప్రధాన కార్యాలయం గల విశాఖ నగరంలో ఇప్పటికే 300 మందికిపైగాబాధితులు సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఒక్కరోజే 50కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.

విశాఖనగరం మొత్తానికి బాధితులంతా సీసీఎస్‌లోనే ఫిర్యాదు చేసే ఏర్పాటు చేయడంతో రోజురోజుకూ ఇక్కడకొచ్చే బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఫిర్యాదుల తాకిడిని తట్టుకోలేక పోలీసులు మూడురోజులు గా బాధితులకు టోకెన్లు జారీచేస్తున్నారు. రోజుకు 50 మందికి మాత్రమే టోకెన్లు జారీచేసి, మిగిలినవారి నుంచి మరుసటిరోజు తీసుకుంటున్నారు. దీంతో టోకెన్ల కోసం  స్టేషన్ ఎదుట తోపులాట చోటుచేసుకుంటోంది. ఇదిలా ఉండగా, బొమ్మరిల్లు యాజమాన్యంపై ఇతర జిల్లాల్లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 15, కరీంనగర్, నల్లగొండ జిల్లాలోనూ 5కి పైగా నమోదయ్యాయని సమాచారం.

నయా మోసం...
బొమ్మరిల్లు ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో శాతావాహన వెంచ ర్ పేరుతో కోట్లు కొల్లగొట్టినట్టు తాజాగా తేలింది. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలోనూ సంస్థ మోసాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆర్.ఆర్.రాజా కాల్‌లిస్ట్ సేకరణ
బొమ్మరిల్లు పూర్వపు ఎండీ ఆర్.ఆర్. రాజా కోసం పోలీసులు వివిధ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ మేరకు రాజావాడిన సెల్‌ఫోన్‌కు సంబంధించిన కాల్‌డేటాలిస్ట్ కూడా సేకరించారు. అయితే, పోలీసు నిఘా నేపథ్యంలో ప్రస్తుత సెల్‌ఫోన్ గాక కొత్త సిమ్ వాడుతున్నట్లు గుర్తిం చారు. ఆ నంబర్ ఒక్కోసారి బెంగళూరు, మరికొన్నిసార్లు అనంతపురం జిల్లా హిందూపురం సిగ్నల్స్ చూపుతున్నాయని కేసు దర్యాప్తుచేస్తున్న పోలీసులు ‘సాక్షి’కి వివరించారు.

బొమ్మరిల్లు ద్వారా కోట్లకుకోట్లు గడించి తెలివిగా బయటపడ్డ రాజా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి  తెలుగుదేశం పార్టీ  ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా, అనుహ్యంగా ఫైనాన్స్ కంపెనీ దివాలా వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో ఏదోలా కేసునుంచి తప్పించుకునేందుకు పార్టీలోని కొందరు ప్రముఖుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పెరుగుత్ను అప్పుల చిట్టా
బొమ్మరిల్లు 40 వేల మంది ఖాతాదారుల నుంచి రూ.100 కోట్లకుపైగా వసూళ్లు చేసిందని పోలీసుల దర్యాప్తులో తేల్చింది.
* సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న వివిధ డాక్యుమెంట్ల ద్వారా రూ.30 కోట్ల విలువచేసే ఆస్తులను గుర్తించారు.
పలు జిల్లాల్లో 300 ఎకరాల వరకు   భూములు ఉన్నట్లు గుర్తించారు.
అయితే బొమ్మరిల్లు ఆస్తులు, అప్పులు, ఖాతాదారులను ఏ విధంగా మోసం చేసిందనే దానిపై కోర్టు పోలీసులకు గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఆస్తులపై పోలీసులు సోమవారం నుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు.

* ఖాతాదారులకు ఇంకా రూ.60 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని మొదట్లో అనుకున్నా అది రూ. 70 కోట్లకుపైగా ఉండవచ్చని భావిస్తున్నారు.
* ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారని, కొన్నింటికి డాక్యుమెంట్లు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
* ప్రసుత్తం బొమ్మరిల్లుపై కోర్టులో మరిన్ని ఆధారాలతో కేసు వేయా ల్సి ఉన్నందున ఖాతాదారుల సమాచారం, వారిని ఏ విధంగా మోసం చేసిందనే వివరాలను తయారుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement