
ఊరూరా భోగి సందడి
నేడు సంక్రాంతి పండగ
నెల్లూరు(అర్బన్): సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నారుు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా భోగి పండగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి ప్రారంభమైంది. తాటి ఆకుతో పాటు పాతచీపుర్లు, పాత కాగితాలు, సామగ్రితో భోగి మంటలు వేశారు. ఒకరితో ఒకరు పోటీ పడటంతో మంటలు ఆకాశాన్ని అంటారుు. నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, వింజమూరుతో పాటు ప్రతి పల్లెలో వేకువ నుంచే భోగి సందడి కనిపించింది.
మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నా జనం లెక్కచేయక మంటలు వేసి చలిని తరిమికొట్టారు. దాదాపు ప్రతి చోట యువకులు, పిల్లలు బృందాలుగా ఏర్పడి భారీ ఎత్తున మంటలు వేశారు. పల్లెల్లోని కూడళ్లలో అరుుతే పండగ సందడి మరింత ఎక్కువ కనిపించింది. సంప్రదాయంలో భాగంగా చిన్నారులకు భోగిపండ్లు పోయడంతో పాటు శనగలు, పూలు, చెరకు ముక్కలు, నాణేలతో ఆశీర్వదించి దిష్టి తీశారు.
అపార్ట్‌మెంట్ వాసులు సామూహిక భోగి మంటలను వేసుకుని సందడి చేశారు. గొబ్బిపాటలతో పల్లెలు మార్మోగాయి. నెల్లూరులోని బాలాజీనగర్‌లో చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసులు కీర్తనలు ఆలపించడం పండగకు ప్రత్యేక శోభ తెచ్చాయి.
తాటాకు ధరకు రెక్కలు
భోగి పండగలో కీలకమైన తాటాకు ధర చుక్కలనంటింది. గతంలో గ్రామాల్లో తాటిచెట్లు భారీగా ఉండేవి. ప్రధానంగా జిల్లాలోని తీరప్రాంతంలో తాటి తోపులు విస్తారంగా కనిపించేవి. ఇటీవల కాలంలో వెనామీ సాగు జోరందుకోవడం, పలు పరిశ్రమలు ఏర్పాటవడంతో తాటిచెట్లు నేలకూలారుు. ఈ క్రమంలో తాటకు ధర భారీగా పెరిగింది. 20 ఆకులు కూడా లేని కట్టను రూ.200 వరకు విక్రరుుంచారు. దీంతో నగర, పట్టణ వాసులకు పండగ ఖర్చు కొంత పెరిగింది. ప్రధాన కూడళ్లలో కనిపించే పెద్దపెద్ద మొద్దుల స్థానంలోనూ టాటాకులే కనిపించారుు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా...
తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పల్లెల్లో గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నత్యాలు కనులవిందు చేస్తాయి.
హరిలో రంగ హరీ అంటూ నెత్తిపై నుంచి నాసిక వరకు తిరుమణి పెట్టుకొని ఘల్లుఘల్లు మంటూ చిందులు వేస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసు ప్రత్యక్షమవుతారు. అయితే ప్రస్తుతం హరిదాసుల సంస్కృతి బాగా తగ్గిపోయి కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. నగరాల్లో కంటే పల్లెల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండగ ఎంతో ప్రత్యేకం. ఎక్కడున్నా తొలి పండగకు భార్యతో అత్తవారింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే వారు అత్తారింటికి సందడి చేస్తున్నారు.
బోడిగాడితోటలో ప్రత్యేక ఏర్పాట్లు
సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బోడిగాడితోట(హిందూ శ్మశాన వాటిక)లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పితృ దేవతలకు సంతర్పణ చేసే కార్యక్రమం నగరంలో భారీ స్థాయిలో జరగనుంది. ఇప్పటికే నగర వాసులు పలువురు తమ ఆత్మీయుల సమాధులను ప్రత్యేకంగా అలకరించారు. గురువారం ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారు.