సాధారణ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి... అక్కడున్న సామాజికవర్గాలు ఎవరివైపు మొగ్గు చూపాయి... తదితర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు.
బందరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, టీడీపీల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ నాయకులు బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసినప్పటికీ గెలుపు ఎవర్ని వరిస్తుందనే అంశంపై అభ్యర్థులు, వారి అనుచరులు ఆరా తీస్తున్నారు. బందరు నియోజకవర్గంతో పాటు జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా... ఎన్ని సీట్లు వస్తాయి... టీడీపీ ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటుందనే అంశాలపైనా పలువుర్ని అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు
బందరు నియోజకవర్గంలో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నాపురం, ఉల్లింగిపాలెం, వాడపాలెం, సుల్తానగరం తదితర ప్రాంతాల్లో మిలటరీ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి అల్లర్లు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును తెలుసుకునేందుకు వెబ్ కెమేరాల సహాయంతో తెరను ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని ప్రజలు తిలకించేందుకు వీలు కల్పించారు.