విద్యార్థులకు వరం
వైవీయూ, న్యూస్‌లైన్ : కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యావిధానంలో సైతం అధునాతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా తాను చదివే చదువుతో పాటు నచ్చిన సబ్జెక్టుల్లో సైతం ప్రావీణ్యం పొందుతూ డిగ్రీ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని ఉన్నతవిద్యాశాఖ విద్యార్థులకు అందిస్తోంది.
ప్రయోగాత్మకంగా రాష్ర్టవ్యాప్తంగా తొలిసారి చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పేరుతో నచ్చిన విద్యను అందిపుచ్చుకునేందుకు అటానమస్ హోదా కలిగిన 10 కళాశాలలను ఎంపికచేశారు. రాయలసీమ నుంచి కర్నూలు సిల్వర్‌జూబ్లి కళాశాలతో పాటు కడపకు చెందిన ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)కు ఈ అరుదైన అవకాశం దక్కింది.
చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) అంటే..
డిగ్రీ విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టుతో పాటు ఇతర అంశాలపైనా అవగాహన పొందేందుకు రూపొందిస్తున్న పాఠ్యప్రణాళికా విధానమే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఈ సిస్టమ్‌ను 2014-15 విద్యాసంవత్సరం నుంచి స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలో తొలిసారిగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కళాశాలల అధ్యాపకుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన ఉన్నత విద్యాశాఖ ఈ యేడాది నుంచి అమలుచేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
ఈ విధానం ప్రకారం కాలేజ్ స్టడీస్ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. ప్రతి విభాగానికి అనుబంధంగా మరో రెండు ఏవైనా పరీక్షపత్రాలను విద్యార్థి చాయిస్ విధానంలో ఎన్నుకోవచ్చు. ఓ విద్యార్థి బీఎస్సీ చదువున్నట్లయితే ఆ విద్యార్థి సాప్ట్‌వేర్ కానీ పర్యాటకం, జెమాలజీ, జర్నలిజం ఇలా ప్రత్యేకతలు కలిగిన 18 అంశాల్లోని ఏవైనా సబ్జెక్టును ఎన్నుకోవచ్చు. అలాగే ఒక గ్రూపునకు సంబంధించిన విద్యార్థులు మరో గ్రూపుకు చెందిన సబ్జెక్టులను సైతం ఐచ్చికంగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తారు.
ఈ పరీక్షా విధానంలో సైతం గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అవుట్ స్టాండింగ్ గ్రేడ్, ఏ గ్రేడ్, బీ గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఇ గ్రేడ్, నాట్ క్వాలిఫైడ్ గ్రేడిం గ్ (ఎఫ్ గ్రేడ్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
సెమిస్టర్ స్థానంలో మాడ్యూల్స్..
ఈ యేడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందే విద్యార్థి తొలిసంవత్సరం క్రెడిట్ 1, క్రెడిట్ 2తో ప్రథమ సంవత్సరం పూర్తయిన తర్వాత సెకండియర్ చివరలో సర్టిఫికెట్ కోర్సు లేదా విద్యార్థి ఐచ్ఛిక సబ్జెక్టు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. చదువుతున్న సిలబస్‌కు అవసరాన్ని బట్టి అదనంగా చేర్చడం లేదా తొలగించడం తదితర ప్రక్రియలతో కూడిన విధానం విద్యార్థికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతం..
జిల్లాలో అటానమస్ పొందిన కళాశాల కావడంతో సీబీసీఎస్‌ను ఆర్ట్స్ కళాశాలలో అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థి స్వేచ్ఛగా తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకుంటూ ఇతర సబ్జెక్టులపైనా అవగాహన పొందవచ్చు. ఈ యేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం అమలుపరచనున్నాం.
- డాక్టర్ రవికుమార్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప