సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా డి–పట్టాలు ఇవ్వకుండా పేద అక్కాచెల్లెమ్మలకు సర్వహక్కులతో పట్టాలిచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం భావించారు. దీన్ని సహించలేని చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి కుట్ర పన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతుంటే టీడీపీ నేతలు సాంకేతిక కారణాలు లేవనెత్తుతూ కేసులు వేయడమే దీనికి నిదర్శనం’’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇళ్లస్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వేసిన నాలుగు రిట్ పిటిషన్లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చిందన్నారు. అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేనందున జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టి, న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
♦ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలన్నదే సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఇళ్ల స్థలాల పంపిణీకి 30 లక్షలమంది అర్హులైన పేదలున్నారని ప్రభుత్వం గుర్తించింది. వారికి ఇళ్లస్థలాలకోసం 26,034 ఎకరాల్లో లేఅవుట్లు వేసి పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
♦కానీ టీడీపీ రాక్షస బుద్ధితో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. పేదలకు ఇళ్లస్థలాలివ్వడం నేరమా? అక్కాచెల్లెమ్మల పేరున ఇళ్లస్థలాలిస్తే పాపమా? సొంత ఇళ్లు కల్పించి పేదలకు సామాజిక గౌరవం కల్పించాలని సీఎం నిర్ణయించడం అన్యాయమా? మరి ఎందుకు కేసులు వేయించి ఇళ్ల స్థలాల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి.
♦ టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వెనుకడుగు వేయరు. ఈ అంశంపై కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి.. అనుమతి తీసుకుని మరీ పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15న రాష్ట్రంలోని పేదలకు ఆనందాన్ని పంచుతూ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. పేదలు నిరాశ చెందనక్కర్లేదు. పేద అక్కాచెల్లెమ్మలను ఆగస్టు 15న ఇంటిస్థల యజమానులను చేస్తారు.
టీడీపీ ఐదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు
♦ చంద్రబాబు ఐదేళ్లపాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకివ్వలేకపోయారో టీడీపీ సమాధానం చెప్పాలి. 2014 నుంచి 2016 వరకు ఒక్క ఇంటికి శంకుస్థాపన చేయలేదు. ఆ తరువాత మూడేళ్లలో వివిధ పథకాల కింద కేవలం 6.20 లక్షల ఇళ్లు కట్టాలని నిర్ణయించింది. కానీ 3.50 లక్షల ఇళ్లే పూర్తి చేసింది. ఒక్క లబ్ధిదారునికీ అందించలేకపోయింది.
♦ ఇక టిడ్కో ద్వారా జీ+3 విధానం కింద 7,01,401 హౌసింగ్ యూనిట్ల నిర్మాణంలో టీడీపీ భారీ అవినీతికి పాల్పడింది. చదరపు అడుగుకు ఏకంగా రూ.2,500 కింద కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. అంతేగాక బ్యాంకు రుణాల పేరిట పేదలపై ఆర్థికభారం మోపింది. కేవలం 3,09,432 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. వాటిలోనూ 77,371 ఇళ్లనే 90 శాతం పూర్తి చేసింది. 50 వేల ఇళ్ల పునాదులు కూడా పూర్తి చేయలేదు. ప్రభుత్వానికి రూ.4,322 కోట్లు బకాయిలు పెట్టింది.
ఏపీ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వ విధానమిదీ..
♦ టీడీపీ అసంపూర్తిగా వదిలేసిన ఏపీ టిడ్కో ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించి విధాన నిర్ణయం తీసుకున్నారు. టిడ్కో ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఆదా చేసిన రూ.400 కోట్లను పేద లబ్ధిదారులకు బదలాయిస్తూ ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు.
♦ 300 చ. అ ఇళ్లకు టీడీపీ రూ.3.50 లక్షల ధర నిర్ణయించింది. కానీ ఆ ఇళ్లను పేదలకు ఫ్రీగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
♦ 365 చ.అ. ఇంటికి రూ.4.15 లక్షలు, 430 చ.అ. ఇంటికి రూ.4.65 లక్షలుగా టీడీపీ ప్రభుత్వం ధర నిర్ణయించింది. వాటిపై ఆ లబ్ధిదారులదే తుది నిర్ణయం. వారు కోరుకుంటే ఆ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది. వద్దంటే రద్దు చేస్తుంది. వారు టిడ్కోకు చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కిచ్చేస్తుంది. వారందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలిచ్చి.. ఇళ్లు కట్టించి ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment