- లబ్ధిదారుల ఎంపిక కమిటీలకు హైకోర్టు బ్రేక్
- ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు
- ఎమ్మెల్యే ఆది చొరవతో న్యాయపోరాటం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాపాలనను అందించాల్సిన ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు ఒడిగట్టింది. తెలుగుతమ్ముళ్లకు దొడ్డిదారిన అధికారిక పెత్తనం చలాయించే అవకాశం కల్పించింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ వర్గీయులను నియమించింది. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి హైకోర్టు పుల్‌స్టాప్ పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మలమడుగు ప్రతినిధులు హైకోర్టులో వేసిన రిట్‌కు పిటీషన్ అనుగుణంగా తీర్పు వెలుబడింది.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏకపక్ష పాలనకు శ్రీకారం చుట్టింది.ప్రతి నిర్ణయానికి తెలుగుతమ్ముళ్లు కీలక వ్యక్తులుగా మారారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలయ్యారు. విపక్ష పార్టీ సభ్యులను కట్టడి చేయాలనే లక్ష్యంతో సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ వర్గీయులకు అగ్రపీఠం వేశారు. రాష్ట్ర మంత్రి సూచించిన వారినే ఎంపిక కమిటీ సభ్యులుగా చేరుస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈపరిణామంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రజాప్రతినిధులకు అండగా హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఎమ్మెల్యే ‘ఆది’ చొరవతో
ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కాదని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు టీడీపీ కార్యకర్తలకు అగ్రస్థానం కల్పించింది. మండల పరిధిలో ఏర్పాటైన కమిటీ సూ చించిన అభ్యర్థులు మాత్రమే రుణాలు పొం దేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఈ పరి ణామాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దృష్టికి జమ్మలమడుగు స్థానిక సంస్థల ప్రతినిధుల తీసుకెళ్లారు. ప్రభుత్వ అక్రమ, అడ్డగోలు నిర్ణయంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జమ్మలమడుగు మున్సిపల్ చైర్‌పర్సన్ తాతిరెడ్డి తులశమ్మ, ఎంపీపీ ద్వారకచర్ల అరుణ, కొండాపురం జెడ్పీటీసీ యల్లాల సుబ్బలక్షుమ్మతో పాటు మరో ఐదుగురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర, జిల్లా ఎస్సీ,ఎస్టీ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులుగా చేరుస్తూ దాఖలైన రిట్‌పిటీషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 226కు విరుద్ధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టుకు ప్రతివాదులు విన్నవించారు.
హైకోర్టు ఛీప్ జస్టీస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టీస్ సంజయ్‌కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల ద్వారానే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని సభ్యులుగా చేపట్టడాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇప్పటికే ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ వర్గాలకు చేరాయి.