ఖమ్మం, న్యూస్‌లైన్: తరతరాలుగా అడవిలో పోడుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులకు అటవీ చట్టాలు అమలు కావడంలేదని, గిరిజనులకోసం చేసిన చట్టాలు వారిపై పెత్తనం చేసే వారికి చుట్టాలుగా మారాయని, హక్కుల సాధనకోసం గిరిజనులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ పిలుపు నిచ్చారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, అక్రమ అరెస్టులు నిలిపి వేయాలని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
బహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన బృందాకారత్ ప్రసంగిస్తూ.... ఇక్కడి గిరిజనులను అటవీ శాఖాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, వన సంరక్షణ సమితి పేరుతో వారినుంచి భూమిని లాక్కుంటున్నారని మండిపడ్డారు. అయినా ముఖ్యమంత్రి కానీ, ఇతర నాయకులు కానీ, స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత సంవత్సరం నీలం తుపాను, ఇప్పుడు పై-లీన్, ఇతర తుపాన్‌ల మూలంగా రాష్ట్రంలో రైతులు పంటలు నష్టపోయారని... అయినా ప్రభుత్వం స్పందించడం లేదని, గత సంవత్సరం పంట నష్టపోయిన జిల్లా రైతులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఏం ప్రయోజనం.. ఆంధ్రాకి ఏం ప్రయోజనం అని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారే తప్ప గిరిజనుల సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. త్రిపుర రాష్ట్రంలో గిరిజన చట్టాలను సద్వినియోగం చేసుకుని పోడు వ్యవసాయంతో అక్కడి గిరిజనులు ఆర్థికాభివృద్ధి చెందారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని లాక్కుని వారిని ఆర్థికంగా చిదిమేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనులకు అనుకూలంగా స్పదించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నప్పుడు వారికి రక్షణ కల్పించేందుకు గుర్తుకురాని చట్టాలు గిరిజనులపై దాడులు చేసేందుకు ప్రభుత్వానికి గుర్తుకు వచ్చాయని విమర్శించారు. గిరిజనులు పోడు చేసుకుంటున్న 50 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలు చేసిన ఉద్యమాలకు తలొగ్గి ప్రభుత్వం గిరిజన చట్టాలు చేసిందని, వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని విమర్శించారు. జిల్లాలో 4.7 లక్షల మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకుంటే 60వేల ఎకరాలకు భూ పట్టాలు పంపిణీ చేశారని, ఇప్పటి వరకు వారికి భూమిని చూపలేదన్నారు. మిగతా గిరిజనులకు భూమి పట్టాలు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు అటవీశాఖాధికారులు తమ పరిధిలో భూమి ఉందని వేధింపులకు గురి చేస్తున్నారని, పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో దేశద్రోహులు, దోపిడీదారుల ఆచూకీ తెలిపితే బహుమతులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అడవిలోకి వెళ్లే గిరిజనుల ఆచూకీ తెలిపితే బహుమతులు ఇస్తామని పోస్టర్లు వేయడం సిగ్గుచేటన్నారు. పోలవరంతో భద్రాచలం ప్రాంతం ముంపునకు గురవుతుందని.., ఆంధ్రా ప్రాంతానికి నష్టం కలగకుండా డిజైన్ మార్చవచ్చునని వ్యవసాయ నిపుణులు చెప్పినా గిరిజనులను ముంచేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తెలంగాణపై సీపీఎం మొదటినుంచి స్పష్టమైన వైఖరి వ్యక్తంచేస్తోందని, వైఎస్‌ఆర్‌సీపీ కూడా తన వైఖరిని ప్రకటించిందన్నారు.
కానీ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఒకతీరు, ఆంధ్రాలో ఒకతీరుగా ద్వంద్వవైఖరిని అవలంబిస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే నిర్ణయాన్ని ప్రకటించాలని అన్నారు. భద్రాచలం తెలంగాణలో ఉండటమే సౌకర్యంగా ఉంటుందని, తూర్పు గోదావరి జిల్లాలో కలిపితే ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ.. గిరిజనులపై దాడులు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, నాయకులు కాసాని అయిలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, ఎర్రా శ్రీకాంత్, కల్యాణం వెంకటేశ్వర్లు, కృష్ణ, పుల్లయ్య, ధర్మానాయక్, వీరభద్రనాయక్, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు ఉద్యమించాలి: బృందాకారత్
Published Thu, Nov 7 2013 5:08 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement
Advertisement