కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కరుణ చూపలేదు. రాష్ట్ర విభజన తర్వాత వస్తున్న బడ్జెట్‌పై పెట్టుకున్న ఆశలను నిలువునా కూల్చేశారు. హామీల ఊసు ఎత్తకుండా, విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించకుండా అరకొర కేటాయింపులతో సరిపెట్టేశారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఉత్త చేతులు చూపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరిచారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌తో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నిరాశే మిగిల్చారు. నిరుపేదలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా పథకం ద్వారా రూ.12 ప్రీమియంకే రెండు లక్షల బీమా కల్పించడం కాస్త ప్రయోజనకరమైంది. జిల్లాలోని గుంకలాంలో ఏర్పాటు చేసే అవకాశముందని భావిస్తున్న గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. రెండు కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయమే అయినా ఆ మొత్తం ఎటూ చాలదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని గుంకలాంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా ప్రకటించకపోయినా రూ.రెండు కోట్లు కేటాయించడంతో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. వ్యవసాయానికి ఎలాంటి ప్రాధాన్యం కల్పించకపోవడంతో వ్యవసాయమే ప్రధానవృత్తిగా ఉన్న జిల్లా వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు రంగాలకు నిధులు కేటాయించకపోగా వివిధ రకాలు పన్నులతో ధరల పెంపు ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం రూ.17లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమిచ్చేందుకు నిధులు కేటాయించకపోవడంపై రైతాంగం విమర్శిస్తోంది. సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో మధ్య తరగతి ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది.
రాష్ట్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఏదీ?
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ప్రభుత్వం, బడ్జెట్ సమయంలో ఆ విషయాన్ని విస్మరించింది. రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేసింది. ఇది ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేని బడ్జెట్. అన్ని రంగాల ప్రజలనూ విస్మరించారు.
- ఆర్‌వీఎస్‌కే రంగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి
నిరాశే మిగిలింది
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి ఎంతో చేస్తుందని ఆశించాం. కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించిన బడ్జెట్ ఆంధ్రరాష్ట్రానికి తీరని నిరాశ కలిగిం చింది. ఆంధ్రరాష్ట్రం రూ.23వేల కోట్ల బడ్జెట్ లోటులో ఉంటే రూ. 6500కోట్లు ఇచ్చామనిచెప్పారు. ఇది దేనికి సరిపోతుంది?. గిరిజన యూనివర్సిటీకి రూ.2కోట్లు ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్. ఇది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికితీరని నిరాశ కలిగించే బడ్జెట్. - ద్వారపురెడ్డి జగదీష్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు
చెవిలో కమలం..!
Published Sun, Mar 1 2015 12:11 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement