సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించారు. అది చాలదన్నట్టు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రజలకు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం హామీలు విన్న జిల్లా ప్రజలు ఔరా అని ముక్కన వేలేసుకున్నారు.
ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలు నేడు దీనావస్థలో ఉంది. రాజధాని నినాదాన్ని నీరుగార్చడానికే సీఎం చంద్రబాబు నాయుడు.. టెక్స్‌టైల్ హబ్, విత్తన పరిశోధనా కేంద్రం, వ్యవసాయ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, విమానాశ్రయం, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం వంటి భారీ హామీలిచ్చారనే విమర్శలున్నాయి.
అయితే ఈ హామీలు ఆచరణ రూపం దాల్చుతాయా? లేదా? అనేది ప్రశ్నగా మిగిలింది. బాబు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బడ్జెట్ ముఖ్యం. బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి జరుగునున్న సందర్భంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు హామీల అమలుకు అసెంబ్లీలో చర్చించి నిధులు రాబట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది.
ఇవీ ప్రజల ఇక్కట్లు..
వాతావరణంలో మార్పులతో జిల్లాలోని పల్లెలు రోగాల బారిన పడుతున్నాయి. వైద్యసేవలు అందించాల్సిన అధికార యంత్రాంగం నిద్దురపోతోంది.
ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ స్వగృహ నిర్మాణాల్లో పురోగతి లేదు. గృహకల్పకు మంగళం పాడారు.
పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు లేక వేలాది ఎకరాల్లో సాగుచేసిన పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. అనేక చోట్ల ఎండిన పంటలను తీసేస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడి నేలపాలవుతోంది.
టీడీపీ అధికారంలోకి వస్తే పంట రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాలయాపన చేయటంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
కనీసం రీషెడ్యూల్ చేస్తే కొంతైనాఊరట దొరుకుతుందని భావించారు. అది కూడా లేదని తేలిపోయింది.
జిల్లాలోని 165 గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
మంచినీటి సరఫరా చేసే 48 వాటర్ స్కీంలో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
కొన్ని గ్రామాల్లో 3, 4 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా అవుతోంది.
జిల్లాలో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు-బళ్లారి రోడ్డు అధ్వానంగా తయారైంది. కొందరు నాయకులు కమిషన్లకు కక్కుర్తిపడటంతో ఈ రహదారి విస్తరణకు నోచుకోలేదు.
జీఓ నంబర్ 389 కింద ఉపాధి నిధులతో గ్రామ పంచాయతీల్లోని ఎస్టీ కాలనీల్లో సీసీరోడ్లు నిర్మించాలి. అయితే నిబంధల కారణంగా పనులు చేసేందకు ఎవరూ ముందుకు రావకపోవటంతో అనేక చోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
జాతీయ రహదారులకు మోక్షం ఎన్నడని జనం ఎదురుచూస్తున్నారు.
వరదల నుంచి రక్షణేదీ?
2007, 2009లో వచ్చిన వరదలతో జిల్లా ప్రజలు అతలాకుతలమయ్యారు. హంద్రీ, కుందు నదుల తీర ప్రాంత ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. ప్రాణాలను అరచేతపట్టుకుని వరదల నుంచి గట్టెక్కారు. 2007లో వరద బాధితుల కోసం వచ్చి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డివరదల నుంచి రక్షించేందుకు శాశ్వత పరిష్కారం కోసం తక్షణం రూ.342 కోట్లు మంజూరు చేశారు.
కుందూనది వరద రక్షణ గోడ పనులు కొంత మేరకు జరిగినా, ఇంత వరకు కర్నూలు వరద గోడ పనులు మొదలు కాలేదు. ఇలా జిల్లాలో ఎన్నో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటిపై అసెంబ్లీ చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
హామీలు అమలయ్యేనా!
Published Mon, Aug 18 2014 2:41 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement