
ధరాఘాతం
ఎకొండెక్కి కూర్చున్న నిత్యావసరాలు
మధ్య తరగతికి బతుకు భారం
వాచ్‌మేన్‌గా ఉంటూ, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తూ నెలకు వచ్చే ఐఆరు వేల ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పప్పులు గతంలో కేజీ రూ.100కి కొనేవాడ్ని. ఇప్పుడు రెండొందలయింది. ఉల్లిపాయలు వారానికి రెండు కిలోలు కొనేవాడ్ని. ఇప్పుడు కేజీతోనే సరిపెడ్తన్నాను. పెరిగిన రేట్లతో బతకడం కష్టమైపోతుంది. గతంలో పిల్లల్ని సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు పిల్లలు అడిగినా తీసుకెళ్లడం లేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నాం. నెలకు రెండు వేలు అదనంగా ఖర్చవుతోంది. ధరలు తగ్గించకపోతే పేదలు, మధ్యతరగతి వాళ్లు బతకలేరు. అక్కయ్యపాలెంకు చెందిన వాచ్‌మెన్ దాకమర్రి కృష్ణ ఆవేదన ఇది..
మార్కెట్లో ఒక్క నిత్యావసర సరుకు ధర పెరిగితేనే అమ్మో! అంటాం. అలాంటిది పాలు, నీళ్లు తప్ప అన్నీ కొండెక్కి కూర్చుంటే ఏం చేస్తాం? వాటిని కిందకు దించేందుకు ప్రయత్నించే వారే కరువైతే ఏం చేస్తాం? బతకడం కోసం చచ్చినట్టూ కొనుక్కు తింటాం. ప్రతి మధ్య తరగతి కుటుంబం కొన్ని నెలలుగా అదే చేస్తోంది. అరకొర ఆదాయంతో అతికష్టంపై పిల్లాపాపలతో బతుకు బండి లాగిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం
విశాఖపట్నం: మూడు నెలల క్రితం కిలో ఉల్లిపాయలు రూ.80లకు చేరితే అంతా అల్లాడిపోయారు. అయ్యబాబోయ్.. ఎంత ధరో! అంటూ లబలబలాడారు. రైతుబజార్లలో సబ్సిడీ ధరకు కుళ్లిపోయిన ఉల్లిపాయలను విక్రయిస్తున్నారంటే కిలోమీటర్ల మేర గంటలకొద్దీ నిలబడి కొనుక్కున్నారు. ఓపికలేని వారు కిలోలకు బదులు పాయలతోనే సరిపెట్టుకున్నారు. ఆ వెంటనే కాయగూరల రేట్లూ శరవేగంగా పెరిగిపోయాయి. గతంలో కిలో రూ.10కి, 20కి దొరికిన సాదాసీదా కూరగాయలు కూడా కోరలు చాచాయి. అంతలోనే నిత్యం ఇంట్లో అవసరమయ్యే మినపపప్పు, కందిపప్పు ధరలు పోటాపోటీగా ఎగబాకాయి. రెండు నెలల వ్యవధిలో అవి రెట్టింపయ్యాయి. దీంతో ఉల్లిపాయలకంటే ఒక్కొక్కటీ భారమవడంతో ఉల్లి ప్రతాపాన్ని మరిచిపోయారు. మార్కెట్లో ఉల్లి సరఫరా కాస్త మెరుగవడంతో ప్రభుత్వం సబ్సిడీ కౌంటర్లను ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పటికీ ఉల్లి కిలో రూ.40లు దిగనంటోంది. రేషన్‌షాపుల్లో కిలో రూ.50కే ఇస్తామన్న కందిపప్పు జాడలేకుండా పోయింది.
ఏం తినాలి? ఎలా బతకాలి?
సంపన్నులకే భారంగా మారిన ప్రస్తుత నిత్యావసర సరకుల ధరలు సామాన్య, మధ్య తరగతి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అసలే అంతంతమాత్రపు బతుకులతో ఉన్న వారికి పిల్లాపాపలతో పూట గడవడం కష్టతరమవుతోంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఓ ఇంట్లో సగటున నెలకు మూడు కిలోల మినపపప్పు, రెండు కిలోల కిందిపప్పు, ఐదు కిలోల ఉల్లిపాయలు, నాలుగు లీటర్ల వంటనూనె అవసరమవుతుంది. ఇలాంటి వారంతా ఇప్పుడు సగానికి పైగా వీటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. ఇంట్లో టిఫిన్ల జోలికివెళ్లడం లేదు. హోటళ్లకెళ్లి తిందామంటే అక్కడ సైజు తగ్గించి, ధరలు పెంచేశారు. దీంతో మినపపప్పుతో వండే వంటకాలకు బదులు బియ్యం, ముంబై రవ్వలతో ఏదొకటి వండుకు తింటున్నారు. గతంలో వారానికి రూ.100కే సంచి నిండిన కూరగాయలు ఇప్పుడు రూ.200లైనా నిండడం లేదు. రూ.50లుండే కేబుల్ బిల్లు రూ.200లు చేసేశారు. నిన్న మొన్నటిదాకా ఒకింత అందుబాటులో ఉన్న చికెన్ ధరలు కూడా మళ్లీ ఎగబాకుతున్నాయి. ధరల భారం ఒకో ఇంటిపై నెలకు 2-3 వేల భారం పడుతోందని అంచనా. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ పోషణే కష్టమవుతుంటే అదుపు తప్పిన ధరల భారాన్ని మోయలేకపోతున్నారు. తమ చిన్నారుల సినిమా, షికార్లు వంటి సరదాలూ తీర్చలేకపోతున్నారు. ఇంట్లో పిల్లలకు ఇష్టమైన పిండివంటలనూ వండిపెట్టలేకపోతున్నారు. ‘సర్దుకుపోండిరా నాన్నా’ అంటూ నచ్చజెప్పుకుంటున్నారు.
అనుబంధాలు ఆవిరి..
ఆకాశంలో విహరిస్తున్న ధరలతో అయిన వారెవరైనా ఇంటికి వస్తున్నారంటే ఆందోళన చెందే పరిస్థితి తలెత్తుతోంది. గతంలో చుట్టాలు, స్నేహితులను ఆప్యాయంగా రమ్మని పిలిచిన వారే ఇప్పుడు ఏదోలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ధరలు అనుబంధాలను ఎలా ఆవిరి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బతకడం కానాకట్టం..
మాది పేద కుటంబం. ఆరెంపీ వైద్యం చేసే నా పెనిమిటి (భర్త) తెచ్చే రెక్కల కష్టంతోనే ఇల్లు కట్టంగా గడుత్తుంది. నెలంతా కట్టపడితే ఏడెనిమిది వేలు డబ్బుల్రావడం నేదు. ఈ గవుర్మెంటు అన్ని సరుకులు రేట్లు పెంచుతూ పోతంది. మాలాంటోల్లు ఎలా బతుకుతారో ఆలోసించడం నేదు. పప్పులూ ఉప్పులూ పెరిగిపోతనాయి. పది సదువుతున్న నా కొడుకు పీజు కట్టడానికే ఈతరమాతరం అవుతంది. గతంలో ఆరేడు వేలతో నెట్టుకొచ్చేవోల్లం. ఇప్పుడు నెల నెలా రెండుమూడు వేలు అప్పుల్జేయాల్సి వస్తోంది. ధరలు తగ్గకపోతే మాలాంటో బతకడం కానాకట్టమే.
-వరలక్ష్మి, గృహిణి, అశోక్‌నగర్
ఈ ధరలెప్పుడూ చూడలేదు..
ఇలాంటి ధరలు ముందెప్పుడూ చూడలేదు. ఇంటిల్లపాదికి ఎంత తక్కువలో చూసుకున్నా నాలుగైదు కేజీల కంది పప్పు, మినపప్పు అవసరం. నిత్యాసవర సరుకుల్లో వెయ్యి రూపాయలు కంది, మినపకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంపై ఆర్ధిక భారం పడుతోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ధరలు పెరగడంతో ఆకుకూరలు తినడం మానేసాం. పప్పు ఉంటేగాని ఆకుకూరలు వండుకోలేం. నాణ్యమైన పప్పులను రేషన్‌షాపుల ద్వారా ఇవ్వాలి. - కె.మహాలక్ష్మి, చిన్నూరు, అక్కయ్యపాలెం.
అమ్మకాలు పడిపోయాయి..
ధరలు పెరగడం వల్ల అమ్మకాలు 30 శాతం పడిపోయాయి. కేజీ కొనేవారు అరకేజీయే కొంటున్నారు. మాకు పెట్టుబడులు పెరిగాయి. టిఫిన్లకు మినపపప్పు, పెసరపప్పులకు బదులు బియ్యం పిండిని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ధరలు తగ్గితేనే గాని అమ్మకాలు పెరగవు. లాభాలు రావు.
-రేపాక రామకృష్ణ, కిరాణా షాపు.