ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
చిలకలూరిపేట : తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖననం చేసిన 10 రోజుల అనంతరం సమాధి నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకాకు చెందిన బాబర్ సిద్ధునాథ్ దేవినాథ్ తన భార్య బాబర్ పంచెపుల(30)తో కలసి సాయిబాబా చిత్రపటం బండిపై ఏర్పాటు చేసుకొని వివిధ రాష్ట్రాల్లో బిక్షాటన చేస్తుంటారు. వీరికి గణేష్, రమేష్ అనే ఇరువురు సంతానం. ఈ నెల ఎనిమిదో తేదీ చెన్నై నుంచి చిలకలూరిపేట పట్టణానికి భార్యాపిల్లలతో వచ్చాడు. ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో రోడ్డు పక్కన సామగ్రి ఉంచాడు. భార్య పంచెపుల అనారోగ్యానికి గురయ్యిందంటూ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించాడు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలసి ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో రోడ్డుపక్కన నిద్రపోయారు.
తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటల సమయంలో పంచెపుల మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని పట్టణంలోని శ్మశానవాటికలో ఖననం చేసి వెళ్లిపోయాడు. అయితే మృతిరాలి తల్లి చంద్రాబాయి తన అల్లుడే కుమార్తెను కొట్టి చంపి ఉంటాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహింపచేశారు. కుమార్తె మృతి చెందిన విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం! కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఇంటూరి రామచంద్రబాబు, తహశీల్దార్ జీవీఎస్ ఫణింద్రబాబు, అర్బన్ సీఐ జి చెంచుబాబు, ఎస్‌ఐ అసన్, ఆర్‌ఐ యలమంద, వీర్వోలు అప్పారావు, సైదా, దీప్తి తదితరులు పాల్గొన్నారు.