మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదు. నెల రోజుల క్రితం ఉన్న ధర కూడా ప్రస్తుతం లేకపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల కంట కన్నీరొలుకుతోంది. తమకు అప్పులే మిగులుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీరులపాడు : పశ్చిమ కృష్ణాలో ఈ ఏడాది 21 వేల 140 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం ఒక కారణమైతే పంట చేతికొచ్చే సమయంలో నీటి తడులకు అవసరమైన సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండు దశకు చేరుకున్నాయి.
ఎన్‌ఎస్‌పీ కాలువల్లో చుక్కనీరు కూడా లేకపోవడంతో రైతులు నేలబావుల పైనే ఆధారపడి మిర్చి పంటకు చాలీచాలని తడులను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు మిర్చి పంటలో బొబ్బర తెగుళ్లు అధికంగా ఉండటంతో వాటి నివారణకు రైతులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా నెలరోజుల క్రితం క్వింటా మిర్చి రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలికిందని, ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.6,500కు పడిపోవడంతో దిక్కుతోచడం లేదని రైతులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజులు గడవకముందే మిర్చి ధర అమాంతం పడిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం...
మిర్చికి ఎకరాకు లక్షా 20 వేల రూపాయల వృరకు ఖర్చులు అయ్యాయృని, పంట దిగుబడి అంతంతగానే ఉండటం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులే మిగులుతాయని రైతులు వాపోతున్నారృు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వెచ్చించారు.
పండించిన పంటను మార్కెట్‌లోకి తీసుకువస్తే పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని, గత మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికి తమను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు అప్పుల బాధ తట్టుకోలేక వచ్చిన ధరకు దళారులకు విక్రయించుకోగా, మరికొందరు మద్దతు ధర కోసం వేచిచూస్తూ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
నేను మూడెకరాల్లో మిర్చి సాగు చేశాను. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఎన్నో వ్యయప్రయాసలు పడి పంటను పండించి చేతికొచ్చే దశలో ధర ఒక్కసారిగా పడిపోవడంతో అప్పులే మిగిలేలా ఉన్నాయి. ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది.
- పూర్ణచంద్రరావు, రైతు