మార్కెట్‌లో మండుతున్న బియ్యం ధరలు | Burning rice prices in the market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో మండుతున్న బియ్యం ధరలు

Published Sun, Oct 20 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

Burning rice prices in the market

 

=కానరాని సన్నరకాల విక్రయాలు
=కొరవడిన అధికారుల పర్యవేక్షణ
=సామాన్యులు గగ్గోలు

 
చోడవరం, న్యూస్‌లైన్: మార్కెట్‌లో మండుతున్న ధరలు సామాన్యుడి ఆకలిని చంపేస్తున్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలతోపాటు బియ్యం ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. సమ్మె లు, బంద్‌లతో ధరలకు కొంతవరకు రెక్కలు రాగా హోల్‌సేల్ వ్యాపారులు భారీగా నిల్వ చేసి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించడంతో మరికొంత ఎగబాకుతున్నాయి. వారం, పది రోజుల వ్యవధి లో ప్రధానంగా సన్నబియ్యం 25 కిలోల బస్తా ధర రూ.100 నుంచి 200ల వరకు పెరిగింది. సాధారణ రకాల ధరలు సైతం భారీగానే పెరిగాయి.

జిల్లాలో బీపీటీ సన్నాలు వరి పంట తక్కువ కావడంతో తూర్పు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గతేడాది తుపాన్లు వల్ల కొంత పంట నష్టపోయినా వరి కావలసినంత పండింది. సగానికి పైగా జనం సన్నబియ్యం వినియోగానికి ఆసక్తి చూపడంతో వీటి ధర ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. చౌక దుకాణాల్లో కిలో రూపా యి బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి అవే బియ్యాన్ని కిలో రూ.20 నుంచి రూ.25 వరకు అమ్ముతున్నారు. ఒక పక్క ధరలు పెంచుతూనే మరో పక్క కల్తీలు కూడా చేస్తున్నారు.

బీపీటీల్లో పలు రకాలు ఉండటంతో దానినే ఆసరాగా చేసుకొని మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు మిలాఖత యి బియ్యాన్ని కల్తీ చేస్తున్నారు. సన్నబియ్యంలో పాలిష్ చేసిన దుడ్డు బియ్యాన్ని కలిపి బ్యాగ్‌లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. దీని వల్ల వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధరలను అదుపులో పెట్టేందుకు గతేడాది పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో మండలానికి నాలుగైదు దుకాణాలు ప్రారంభించింది. అయితే అవి అరకొరగా తెరచుకున్నా కనీస నాణ్యత లేని బియ్యాన్ని అమ్ముతున్నారు.

పౌరసరఫరాల అధికారులు కూడా వ్యాపారులతో కుమ్మక్కయి ఆ దుకాణాలపై కనీస ప్రచారం చేయలేదు. ఇటీవల చాలా చోట్ల ఈ దుకాణాలకు ప్రభుత్వం బియ్యం సరఫరా చేయకపోవడంతో మూసివేశారు. ధరల నియంత్రణపై వీరి పర్యవేక్షణ కూడా కొరవడింది. దీనిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా బియ్యం ధరలు పెంచడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అసలే కూరగాయలు, నిత్యావసర సరకులు కొండెక్కి కూర్చోవడంతో ఇప్పుడు బియ్యం ధరలూ పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement