సాక్షి, విజయవాడ బ్యూరో: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు బస్సు చార్జీల పెంపు, ప్రయాణికుల సంఖ్య పెంపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని సంస్థ ఎండీ జె.పూర్ణచంద్రరావు ఆదివారం తెలిపారు. ఆర్టీసీకి రూ.2,500 కోట్ల మేర అప్పులున్నాయన్నారు. గత ఐదేళ్లలో బంద్‌లు, ఆందోళనలు, సమ్మెల కారణంగా మరో రూ.2,233 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. 40 శాతం ఆర్టీసీ బస్సులను గ్రామీణ ప్రాంతాల్లోనే తిప్పుతున్నామని, వీటి వల్ల కేవలం 28 శాతమే ఆదాయం వస్తోందన్నారు. ఆర్టీసీని రిలయన్స్‌కు అప్పగించనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ భవనాల నిర్మాణానికి కనీసం 50 ఎకరాలు అవసరమవుతాయన్నారు.
ఆర్టీసీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల కోసం అవకాశం ఉన్న అన్ని వనరులను తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాల్సి వచ్చిందని, అందులో భాగంగానే సీసీఎస్ సొమ్మును ఖర్చు చేశామని ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించా రు. ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సీసీఎస్ సొమ్ము చెల్లింపు, ఇతర సమస్యలపై ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీసు ఇవ్వటంపై స్పందిస్తూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె నివారణకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.