‘గ్యాస్’ కొట్టేస్తున్నారు!
రాయితీ గ్యాస్‌తో వ్యాపారం
వాణిజ్య సిలెండర్లలో నింపి అమ్మకాలు
అక్రమ దందాకు ఏజెన్సీల సహకారం
నిద్దరోతున్న నిఘా
‘‘శ్రీమంతులంతా గ్యాస్ రాయితీని వదులుకోండి.. పేదలకు మరింత తక్కువ ధరకు గ్యాస్‌ను సరఫరా చేసేందుకు సహకరించండి’’ అంటూ సాక్షాత్తు భారత ప్రధానమంత్రే పిలుపునిస్తున్నారు.. కొందరు స్పందిస్తున్నారు కూడా.. మరి మన అధికారులు ఏం చేస్తున్నారు.. రాయితీ గ్యాస్ పక్కదారి పడితే సహించేది లేదు.. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని మీటింగులు పెట్టి హెచ్చరికలు జారీచేస్తున్నారు. తర్వాత ఆమ్యామ్యాలు పుచ్చుకుని అక్రమార్కులకు వంత పాడుతున్నారు. సబ్సిడీ గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చుంటున్నారు.
తిరుపతి మంగళం: నగదు బదిలీ పథకం, ఆధార్ అనుసంధానం, ఇతర చర్యలు ఏవీ అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్నాయి. రాయితీ గ్యాస్‌ను వాణిజ్య సిలెండర్లలో నింపి నిత్యం వందల సంఖ్యలో బహిరంగ మార్కెట్‌కు తరలించి అమ్మేస్తుంటే అధికారులు మాత్రం పైకి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్పితే ఆ పని మాత్రం చేయడంలేదు. జిల్లాలో 79 గ్యాస్ ఏజెన్సీలుండగా 7.26లక్షల కనెక్షన్లకు సిలెండర్లు సరఫరా చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం ప్రతిరోజూ 65 నుంచి 70వేల సిలెండర్లు డీలర్లు సరఫరా చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ కనె క్షన్ల సంఖ్య 16,200వరకు ఉంది. అయితే హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నవారు సబ్సిడీ సిలెండర్లను వినియోగిస్తున్నారు. కొన్ని హోటళ్లలో వాణిజ్య సిలెండర్లు వినియోగిస్తున్నా అందులో గృహ వినియోగ సిలిండర్ల నుంచి నింపిన గ్యాస్ ఉండడం గమనార్హం. ఈ గ్యాస్ దందా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇదీ సంగతి..
నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడూ ఏడాదికి 12 సిలెండర్లను రాయితీపై పొందవచ్చు. అయితే చాలా పేద కుటుంబాలు ఏడాదికి 5 నుంచి 6 సిలెండర్లకు మించి వాడడం లేదు. ఇదే అక్రమార్కుల పాలిట వరంగా మారింది. కొందరు అక్రమార్కులు అలాంటి వారి నెంబర్లు సేకరించి ఏజెన్సీల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నారు. గ్యాస్‌తో వ్యాపారం చేసేవాళ్లే సిలెండర్లను నమోదుచేసి రాయితీ మొత్తాన్ని కనెక్షన్ తీసుకున్న వారికి నేరుగా బ్యాంకులో పడేలా చేస్తున్నారు. మిగిలిన సొమ్ము మింగేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో రాయితీ సిలిండర్ ధర రూ.584. ఇందులో రాయితీ సుమారు రూ.122 లబ్ధిదారునికి బ్యాంకు ద్వారా అందుతుంది. ఇదే గ్యాస్‌ను వాణిజ్య సిలెండర్లలో నింపి డిమాండ్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.1,800వరకు విక్రయిస్తున్నారు. కొన్ని రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకుని గ్యాస్‌ను నింపే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అనుమతి లేని కార్లలో గ్యాస్ కిట్‌లు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఇదే తీరులో గ్యాస్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు.
వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటాం
అక్రమంగా గ్యాస్ నింపే కేంద్రాలపై దృష్టి సారిస్తాం. అలాంటి వివరాలు తెలిస్తే ఫిర్యాదు చేయండి. అధికారులను అప్రమత్తం చేసి నిఘా పెడతాం. ప్రణాళిక ప్రకారం దాడులు చేసి వారి ఆటకట్టిస్తాం.
-జి. నాగేశ్వరరావు, డీఎస్‌ఓ