సీఎన్‌జీ, వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం కేంద్రమంత్రి వర్గం తీసుకోబోతోంది. దేశంలో ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలపై పరిమితిని విధించడాన్ని కేంద్ర మంత్రివర్గం త్వరలో పరిశీలించే అవకాశం ఉందని తెలిసింది.
స్థానికంగా ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలను ప్రభుత్వం ద్వైవార్షికంగా అంటే ఏటా రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఈ సహజవాయువును వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీగా, వంట గ్యాస్‌గా, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, ఎరువుల తయారీకి వినియోగిస్తారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. దేశంలో ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇదివరకే అందుబాటులో ఉన్న క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర అయితే ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు 8.57 డాలర్లు (రూ.705), సముద్ర గర్భంలో కొత్తగా కనుగొన్న కష్టతరమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్ అయితే 12.46 డాలర్లు (రూ.1,026)కు చేరింది.
ఈ ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1న సవరించాల్సి ఉంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం లెగసీ ఫీల్డ్‌ల నుంచి వెలికితీసే గ్యాస్ ధరలు ప్రతి ఎంఎంబీటీయూకు 10.7 డాలర్లు (రూ.881)కు పెరుగుతాయని, కష్టతరమైన ఫీల్డ్‌ల నుంచి వచ్చే గ్యాస్ ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. సీఎన్‌జీ, వంట కోసం వినియోగించే పైప్డ్ గ్యాస్ రేట్లు ఇప్పటికే 70 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1న సవరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇటు వినియోగదారులు, అటు ఉత్పత్తిదారులు ఇద్దరి ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ గ్యాస్ ధరల సవరణను పరిశీలించడానికి కిరిట్ పారిఖ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గత సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మిగులు దేశాలలో గ్యాస్ ధరలను వాటి సహజవాయువు ధరను నిర్ణయించే ప్రస్తుత పద్ధతికి బదులుగా లెగసీ ఫీల్డ్‌ల నుంచి గ్యాస్ ఇండెక్సేషన్‌ను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలలో 10 శాతానికి మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. ఒక ఎంఎంబీటీయూకు కనిష్ట ధర 4 డాలర్లు (రూ.329), గరిష్ట ధర 6.50 డాలర్లు (రూ.535) ఉండాలని పేర్కొంది.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లు ఉంది. దాని ప్రకారం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 7.5 డాలర్లు (రూ.617) ఉండాలి. కానీ పరిమితి అమలైతే గ్యాస్ ధర 6.5 డాలర్లు (రూ.535) మాత్రమే ఉంటుంది. కమిటీ సిఫార్సులపై మంత్రిత్వ శాఖల అంతర్గత సంప్రదింపులు ముగిశాయి. ఈ సిఫార్సులను కేబినెట్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గం దీనిని పరిశీలించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment