మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించేవరకు మార్కెట్‌యార్డులో నిల్వ పెట్టుకుని భద్రపరుచుకోవడంతోపాటు రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పక్కాగా అమలుచేయాలని మార్కెటింగ్, దేవాదాయ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ దాసరి శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని నిడమర్రురోడ్డు మార్కెట్ యార్డు కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. మార్కెట్ యార్డు ఆదాయ వ్యయాలపై యార్డు కార్యదర్శి యోగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు పథకం అమలు తీరుపై ప్రశ్నించారు. ఈ పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేవని, ఇకపై గణాంకాలతో పక్కాగా రికార్డులు నిర్వహించాలని చెప్పారు.
యార్డులో ధాన్యం నిల్వచేసిన మూడు నెలల తర్వాత రైతులకు రుణాలను అందజేయడంతో పాటు ఒకే కుటుంబంలోని ఇద్దరికి పథకం ద్వారా రుణసౌకర్యం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం నిల్వ పెట్టిన రోజే రైతులకు రుణాలు అందజేయాలని, వారి కుటుంబ సభ్యులకు సైతం రుణ వివరాలను తెలుపుతూ పోస్టు కార్డు ద్వారా సమాచారం అందించాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని తిరిగి తీసుకువెళ్లిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకు పోస్టు కార్డు ద్వారా తెలియపర్చాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలను అడగవద్దన్నారు.
మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు
ఏర్పాటుచేయాలి...
పశువులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ఏర్పాటుచేయాలని, ఇందుకో సం యార్డు నిధుల్లో రూ.24 లక్షలు కేటాయించుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసులు పేర్కొన్నారు. రూ.14 లక్షలతో ఒక వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు వైద్యసిబ్బందిని నియమించుకుని మందులు, జీతాలకు మిగిలిన రూ.10 లక్షలు కేటాయించాలని ఆయన సూచించారు. మొబైల్ వెటర్నీరీ క్లినిక్‌లు రైతులకు 24 గంటలు అందుబాటులో వుండాలని, వారానికి ఒక గ్రామం వంతున పర్యటించి వైద్యచికిత్సలు అందించాలన్నారు.
అత్యవసర సమయంలో పాడి పశువులకు వైద్య సదుపాయాలు అందించేందుకు యార్డులో టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం యార్డు ఆవరణలోని గోదాముల్లో ధాన్యం నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, జాయింట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కాకుమాను శ్రీనివాసరావు, అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎం.వరలక్ష్మి, మార్కెటింగ్ ఈఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రైతు బంధు పథకం పక్కాగా అమలుచేయండి
Published Sun, Jun 8 2014 12:07 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement