గౌడ.. మా గోడు ఇదీ | butta renuka meets to sadananda gowda | Sakshi
Sakshi News home page

గౌడ.. మా గోడు ఇదీ

Published Tue, Jul 8 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

గౌడ..  మా గోడు ఇదీ

గౌడ.. మా గోడు ఇదీ

మెరుగైన సౌకర్యాలను పక్కనపెడితే.. కనీస సౌకర్యాలు కల్పించలేని దయనీయ స్థితి నెలకొంది. ప్రతి బడ్జెట్‌లో జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. తీరా ఆ శాఖ మంత్రి ప్రకటనలో ఎలాంటి విశేషాలు ఉండకపోవడం పరిపాటిగా మారుతోంది. ఈ అన్యాయంపై గళం విప్పే నాయకులు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల కంటితుడుపు పురోగతి సాధించగా.. శాశ్వత ప్రాతిపదికన రూపురేఖలు తీసుకురాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ సర్కారు మంగళవారం పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటిలానే జిల్లా ప్రజలు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడపై కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ఫిబ్రవరి 12న యూపీఏ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చివరి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టినా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కనీసం ఈసారైనా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగించాలని.. 44 ఏళ్ల డిమాండ్ అయిన మంత్రాలయం-కర్నూలు మధ్య కొత్త రైల్వే లైన్‌కు పచ్చజెండా ఊపాలని ప్రజలు కోరుతున్నారు.

కర్నూలు (రాజ్‌విహార్): రాయలసీమ ముఖద్వారం.. రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటే. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే చందంగా మారింది. ప్రధానంగా రైల్వే బడ్జెట్‌లో సవతి ప్రేమ కారణంగా ఏటా నిరాశే మిగులుతోంది. ప్రభుత్వాలు మారినా.. జిల్లాకు చెందిన నేత రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టినా ఒరిగింది శూన్యమే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఓ డివిజన్‌కు నోచుకోకపోగా.. కనీసం డబుల్ ట్రాక్ కూడా కరువైంది. గరీబ్థ్ ్రఊసే కరువవగా.. పలు సూపర్‌ఫాస్ట్‌లకు స్టాపింగ్ లభించని పరిస్థితి.
 
కర్నూలుకు ప్రాధాన్యతనివ్వాలి
రవాణా రంగంలో వెనుకబడిన కర్నూలుకు రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వాలి. కర్నూలు-మంత్రాలయం కొత్త లైను ఏర్పాటుతో పాటు గతంలో ప్రకటించిన వర్క్ షాపు నిర్మాణం, కోసిగి-ఎర్నగల్లు-మంత్రాలయం డబుల్ లైను, కొల్లాపూర్-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న రైళ్లను కోసిగిలో ఆపాలి. మంత్రాలయం స్టేషన్‌ను ఆధునీకరించి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. కర్నూలులో అదనపు రిజర్వేషన్ కౌంటరు ఏర్పాటు, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య గరీభ్థ్ ్రరైలు, కర్నూలు-జైపూరు మధ్య కొత్త రైలు, సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా గోవాకు కొత్త రైలును ఏర్పాటు చేయాలి. బెంగళూరు నుంచి కర్నూలు, సికింద్రాబాద్ మీదుగా ముంబైకి నేరుగా రైలు వేయాలి. కర్నూలు మీదుగా వెళ్లే ప్రతి రైలు సిటీ స్టేషన్‌లో నిలపాలి. ఈ డిమాండ్లతో ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో పాటు ఆ శాఖ మంత్రి సదానందగౌడను కలిసి వినతిపత్రం అందించా. కేంద్ర ప్రభుత్వం కరుణ చూపుతుందని భావిస్తున్నా.                

- బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ
 
ఆధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త రైల్వే లైన్ పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. రెండు సార్లు సర్వే చేయగా.. నిధుల వృథాయే తప్పిస్తే ‘మార్గం’ కరువైంది. 110 కిలోమీటర్ల పొడవైన ఈ లైను ఏర్పాటుకు రూ.1100 కోట్లు అవసరమని అంచనా. కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు ఉపయోగకరం.
కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రీహాబిలిటేషన్ వర్క్‌షాపు నిర్మాణాన్ని 2013 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. స్థల సేకరణ చేపట్టినా వివిధ కారణాలతో రద్దయినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.250కోట్లు అవసరమని అంచనా.
దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్(నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని గతంలో మాజీ మంత్రి కోట్ల చెప్పారు. ఇందుకు రూ.2కోట్లు అవసరం. పూర్తయితే దాదాపు 5వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. విజయవాడ వరకు కనీసం రెండు రోజు వారీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది.
గుంటూరు-డోన్-గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల మేర డబుల్ లైను, విద్యుదీకరణకు సర్వే పూర్తయినా నిధుల విడుదల మరిచారు. డోన్ మీదుగా గుంటూరు వరకు సింగిల్ లైనులో రెండు మూడు రైళ్లు మాత్రమే నడుపుతున్నారు.
సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం, ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.2కోట్లకు పైగా నిధులు అసవరం.
గుత్తి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాద్ వరకు డబుల్ లైన్, విద్యుదీకరణకు సర్వే చేసినా పెండింగ్‌లో ఉంది.
తాత్కాలికంగా హాల్ట్ ఇచ్చిన కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు పూర్తి స్థాయి స్టాపింగ్ ఇవ్వాలి. అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్‌లో నిలపాలి.
హోస్పెట్-మంత్రాలయం-కర్నూలు-నంద్యాల-శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం నిర్మించాలి.
డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు.
అర్ధాంతరంగా నిలిచిపోయిన కడప జిల్లా ఎర్రగుంట్ల-బనగానపల్లె-నంద్యాల లైను పనులు. పెండింగ్‌లోని 20 కిలోమీటర్ల(నంద్యాల క్రాస్‌లైన్ వెంకటేశ్వరపురం వరకు) పనులు పూర్తి చేసేందుకు, అసంపూర్తిగా ఉన్న బనగానపల్లె, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ల పనుల పూర్తికి రూ.70 కోట్లు అవసరం.
సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వరకు గరీబ్థ్ ్రనడపాలి.
విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు, హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.
ఆదోని మీదుగా ఔరంగాబాద్ నుంచి రేణిగుంట, యశ్వంత్‌పూర్ నుంచి ఆదోని మీదుగా కాటా(ఉత్తరప్రదేశ్) వరకు రైలు.
కర్నూలు నంద్యాల మధ్య వారంలో ఐదు రోజులు నడుస్తున్న డెమూ ప్యాసింజరు రైలును ప్రతి రోజూ నడపడంతోపాటు ఇందులో మూత్రశాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.
 కర్నూలు-హైదరాబాద్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును డోన్ వరకు పొడిగించాలి.
కర్నూలు- విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు.
కర్నూలులోని కృష్ణానగర్, గుత్తి పెట్రోల్ బంక్ వద్ద, డోన్, బేతంచెర్ల వద్ద అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా లభించని మోక్షం.
తెనాలి, రేపల్లె, గుంటూరు మధ్య నడుస్తున్న ప్యాసింజరు రైలును ఇటీవలే ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు పొడగించారు. దీనిని నంద్యాల మీదుగా డోన్, కర్నూలు వరకు నడపాలి.
మచిలీపట్నం నుంచి ముంబయికి డోన్ మీదుగా రైలు ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో ప్రకటించినా అమలు కాకపోవడం.
డోన్ రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్‌ను 8 నుంచి 12 గంటల వరకు పొడిగించాలి. మరో రెండు ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement