
చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరం: బుట్టా రేణుక
గుంటూరు: చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీలో ఆమె చేనేత సంక్షేమంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పరిపాలన విధానంలో ప్రతి వర్గమూ ఆనందంగా, సంతోషంగా బతికింది. చేనేతల పరిస్థితి దుర్భరంగా ఉంది. మనిషికి కావాల్సిన దుస్తులు తయారుచేస్తున్న చేనేత కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వైఎస్‌ఆర్ పాలనలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. 50 ఏళ్ల కార్మికులకు పింఛన్లు ఇప్పించారు. ఇప్పటి పరిపాలన చూస్తే దారుణంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హమీకూడా చంద్రబాబు నెరవేర్చలేదు.
చేనేతలకు గుర్తింపు కార్డులు లేవు. ఆస్తి పన్ను మినహాయింపు అన్నారు. బ్యాంకు రుణాలు మాఫీ అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, షెడ్డు కట్టుకునేందుకు రుణాలు ఇస్తామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఇలా రకరకాలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. వైఎస్ జగన్ ముందుకొచ్చి చేనేత కార్మికులను పరామర్శించి, ఆర్థికసాయం చేశారు. ప్రభుత్వంలో లేకున్నా ప్రజల సమస్యలపై స్పందిస్తూ చేనేత కార్మికులను ఆదుకుంటున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అందరం ఊహించగలం. కేంద్రం ప్రకటించిన అనేక పథకాలు కొందరికే పరిమితమయ్యాయి. చేనేత కార్మికులకు ఆర్థికసాయం అందించాలి. సకాలంలో రుణాలు, ఉపకరణాలు ఇవ్వాలి. దళారుల బెడద తగ్గించాలి. చేనేత కార్మికులకు వైద్యపరీక్షలు ఉచితంగా చేయించాలి. ముద్ర రుణాలు ఇవ్వాలి. ఆరోగ్య భీమా పథకం వర్తింపచేయాలి' అని బుట్టా రేణుక కోరారు.
చేనేత కార్మికుల సమస్యలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌సీపీ నేత మోహన్‌రావు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రూ. 100 కోట్లు రుణమాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ, రూ. 25 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాలని కోరినా స్పందించలేదని, కానీ వైఎస్ జగన్ మాత్రం వెంటనే స్పందించి జైట్లీ లేఖ రాశారని ఆయన అన్నారు.