సాక్షి, హైదరాబాద్: కరిక్యులమ్ విటె (సీవీ) అంటే బయోడేటా అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఉగ్రవాదుల పరిభాషలో మాత్రం పేలుడు పదార్థాలు! సీడీ అంటే పిస్టల్, డీవీడీ అంటే ఏకే-47. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పేలుళ్లు సృష్టించేందుకు ఈ మెయిల్ ద్వారా కోడ్ భాషలో పంపుకునే సమాచారాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) డీ కోడ్ చేసింది. ఢిల్లీ అధికారులు ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను విచారించిన సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మెయిల్ చాటింగ్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్‌తో సంబంధాలను కొనసాగించినట్లు యాసిన్ చెప్పాడు. ఈ మెయిల్ సందేశాలను పరిశీలించిన అధికారులు అవి కోడ్ భాషలో ఉండటంతో యాసిన్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటిని డీ కోడ్ చేశారు. వెలుగుచూసిన వివరాలను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. ఆ వివరాలను ‘సాక్షి’ సంపాదించింది. పాక్ నుంచి రియాజ్ ‘పటారాసింగ్ యట్ యాహూ డాట్‌కామ్’ మెయిల్ ఐడీతో యాసిన్‌తో నిరంతరం సంబంధాలు కొనసాగించాడు. యాసిన్ ‘బహద్దూర్ యట్ యాహూ డాట్‌కామ్’ ఐడీతో సంప్రదింపులు జరిపాడు. కరాచీ ఆపరేషన్ పేరుతో భారత్‌లో వంద పేలుళ్లకు జరిగిన కుట్రకు సంబంధించి కూడా ఉగ్ర నేతలతో యాసిన్ ఈ విధానంలోనే సంప్రదింపులు జరిపినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు ముందుకూడా మొత్తం ప్రణాళిక పూర్తయిందని, త్వరలో సంతోషకరమైన వార్త వింటారని రియాజ్‌కు యాసిన్ తెలిపాడు.
ఫిబ్రవరి 21న పేలుళ్లకు సరిగ్గా ఒకరోజు ముందు కూడా చాటింగ్ జరిగింది. పేలుళ్ల తరువాత తిరిగి ఫిబ్రవరి 28న వీరు సందేశాలు పంపుకున్నారు. పేలుళ్ల ద్వారా ప్రజలను బాగా భయబ్రాంతులకు గురిచేశారంటూ యాసిన్‌కు పాకిస్థాన్ నుంచి అభినందన సందేశాలందాయి. తదుపరి పేలుళ్ల కుట్రలకు సంబంధించి కూడా యాసిన్ పాక్ ఉగ్రనేతలకు చాటింగ్ ద్వారా వివరించాడు. వంద పేలుళ్లకు సీవీ (పేలుడు పదార్ధాలు) ఇప్పటికే సిద్ధం చేసుకున్నానని చెప్పాడు. ప్రధానంగా పుణే, ముంబయి. గుజరాత్, హైదరాబాద్‌కు సంబంధించిన ప్రస్తావనలే వారి మెసేజ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్రలు చేశారు? పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన రహస్య డెన్‌లు ఎక్కడున్నాయి? అనే సమాచారం యాసిన్ నుంచి రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రాంతాలకు యాసిన్, తబ్రేజ్‌లను తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, చాటింగ్ మెసేజ్‌లలో ‘సబ్ మెరైన్’ పేరిట కొంత సమాచారం ఉండటంతో ఎన్‌ఐఏ దీనిపై ఆరా తీస్తోంది.
ఉగ్రవాదుల కోడ్ భాషలో కొన్ని...
సీవీ పేలుడు పదార్థాలు
సీడీ పిస్టల్
డీవీడీ ఏకే 47
ఖల్దీ పాస్‌పోర్టు
ఏజెన్సీ ఐఎస్‌ఐ
నెవె ఎన్‌ఐఏ
మెట్రో పుణే
జి/జెజూ గుజరాత్
గావ్ ముంబై
దబ్ దుబాయ్
వాగు అల్‌కాయిదా
ప్రిన్స్ యాసిన్ భత్కల్
బెబొ ఇక్బాల్ భత్కల్
బీబీ ఇక్బాల్ స్నేహితురాలు
సమీర్ అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్
అఫ్తాబ్ మోహిసిన్ చౌదరి
సీవీ అంటే బాంబులు!
Published Mon, Sep 30 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement