
'తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం చారిత్రాత్మకం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. టీ.నోట్ పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం కేబినెట్ కు పంపిన అనంతరం దామోదర మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణపై కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోమంత్రి డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను పల్లంరాజు, కావూరి సాంబశివరావులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.