ఇన్నాళ్లూ ముఖం చాటేసి నేడు జిల్లాకు పళ్లంరాజు
ఇన్నాళ్లూ ముఖం చాటేసి నేడు జిల్లాకు పళ్లంరాజు
Published Mon, Oct 14 2013 9:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడున్నర నెలలుగా జిల్లాకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి పళ్లంరాజు ఎట్టకేలకు సోమవారం జిల్లాకు వస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో జిల్లాలో అడుగుపెట్టేందుకు ధైర్యం చాలక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అలుపెరగకుండా జీతాలను వదులుకుని, కుటుంబ కష్టాలను సైతం ఖాతరు చేయని వేలాది మంది ఉద్యోగులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు 75 రోజులుగా జిల్లాలో సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం కంటికి కనబడలేదా అని విమర్శిస్తున్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఇన్నాళ్లుగా అడుగుపెట్టకున్నా పళ్లంరాజుకు సమైక్యవాదుల నుంచి ఎదురైన అవమానాలు జిల్లాలో మరే ప్రజాప్రతినిధికీ ఎదురుకాలేదు. కాకినాడలో ఉద్యమకారులు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టడం, శవయాత్రలు చేయడం మొదలుకుని జేఎన్‌టీయూకే వద్ద స్త్రీ వస్త్రధారణలో ఆయన బొమ్మలను రూపొందించి నిలువెత్తు హోర్డింగ్‌లు పెట్టే వరకు చేసి నిరసనను చాటారు. ఆది నుంచి పార్టీ గాలి ఉంటే నెగ్గుకొస్తామనే సిద్ధాంతాన్ని నమ్ముకోబట్టే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతున్నా ప్రజల ఆకాంక్షలను ఏ కోశానా పట్టించుకోకుండా ఢిల్లీలో రాజీడ్రామాలాడుతూ కాలక్షేపం చేశారని ఉద్యమనేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధంతో పళ్లంరాజు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయగల అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ ప్రజల ఆకాంక్షకంటే పదవిని కాపాడుకోవడమే ముఖ్యమన్నట్టు వ్యవహరించి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని ఇంటా, బయటా విమర్శలను ఎదుర్కొన్నారు.
ఢిల్లీలో ఉండి ఏం చేసినట్టో..
జిల్లావైపు కన్నెత్తి చూడని పళ్లంరాజు ఢిల్లీలో సమైక్యాంధ్ర కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రజలను నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన అనంతరం పళ్లంరాజు పార్టీ అధిష్టానం విభజనకు వెనకడుగు వేస్తున్నట్టు చెప్పారని మీడియాలో ప్రచారం జరిగింది. తీరా తెల్లారేసరికి తెలంగాణ ప్రాంత నేతల ఫిర్యాదుతో సోనియాగాంధీ నుంచి అక్షింతలు పడటంతో ఆ తరువాత పళ్లంరాజుకు మూగనోము తప్పలేదని సమైక్యాంధ్ర ఉద్యమనేతలు ఆక్షేపిస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఏపీఎన్‌జీఓలు ఇచ్చిన పిలుపునకు కూడా పళ్లంరాజు స్పందించిన దాఖలాలు లేవు. పదవికి రాజీనామా చేయకపోతే మానె.. తెలంగాణ నోట్‌ను కేబినెట్ మంత్రిగా ఉండి ఎందుకు వ్యతిరేకించలేదని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
విభజన నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి టి నోట్ కేబినెట్‌కు వచ్చే వరకు పళ్లంరాజు ఈ ప్రాంతవాసిగా ఏమి చేశారని మండిపడుతున్నారు. మొదట్లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పళ్లంరాజు ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాలు తొందరపడొద్దనడంతో ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. టి నోట్ కేబినెట్ ఆమోదం పొందాక కూడా రాజీనామాపై డ్రామాలాడుతున్న తీరుపై సర్వత్రా నిరసనలు పెల్లుబకటంతో చివరకు అయిష్టంగానే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పింది కాదు. జూన్ 30న కాకినాడలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నప్పటి నుంచి ఢిల్లీకే పరిమితమైన ఆయన ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఆయనను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
Advertisement