
కాల్‌మనీలో కాసుల వేట
అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్న పోలీసులు
వడ్డీ వ్యాపారులతో తెర వెనుక ఒప్పందాలు
టీడీపీ వారైతే కేసు నమోదు చేయడానికే నిరాకరణ
ఇప్పటికే ఉన్నవారిని తప్పించే ప్రయత్నాలు
విశాఖపట్నం: ‘కాల్‌మనీ’ వ్యవహారం పోలీసు శాఖకు కాసులు పండిస్తోంది. కొందరు ఖాకీలు వడ్డీ వ్యాపారులపై జరుగుతున్న దాడులను సొమ్ము చేసుకుంటున్నారు. ఫైనాన్స్ కార్యాలయాలు, వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో దొరికిన సొత్తును పూర్తిగా బయటపెట్టడం లేదు. అదే విధంగా కొందరు వడ్డీ వ్యాపారులతో తెరచాటు ఒప్పందాలు చేసుకుంటూ వారిని వదిలిపెడుతున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన వారిపైన కేసు నమోదు చేయడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే కేసులో ఉంటే వారిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ూ గాజువాకలో ఓ మాజీ కార్పొరేటర్ బంధువులపై కాల్‌మనీ కేసు నమోదు చేయమని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కానీ రెండు రోజులైనా వారిపై కేసు నమోదు కాలేదు. ఫిర్యాదు చేసిన వారు, ఆరోపణ ఎదుర్కొంటున్న వారు కూడా స్థానిక ఎమ్మెల్యేకు బంధువులు కావడంతో ఫిర్యాదుదారుడితో సెటిల్‌మెంట్ చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యే వరకు కేసు నమోదు చేయకూడదని పోలీసులు మిన్నకుండిపోయారు. నిజానికి కాల్‌మనీ వ్యవహరంలో ఏ కేసు వచ్చినా వెంటనే ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేస్తున్నారు. కానీ ఈ కేసు విషయంలో మాత్రం అలా చేయకపోవడం చూస్తుంటే అధికార పార్టీ వారికి పోలీసులు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోంది.
గుడివాడ రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారిపై ఇప్పటివరకు రెండో, మూడు, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అతను తన కారుకు టీడీపీ జెండా తగిలించుకుని తిరుగుతుంటే కూడా అతను ఏ పార్టీకీ చెందినవాడు కాడని రికార్డుల్లో చూపిస్తున్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న అతని కారుకు ఉన్న టీడీపీ జెండాను మాయం చేశారు. ఇలా టీడీపీ నేతల బంధువులకు ప్రత్యక్షంగానే పోలీసులు అండగా నిలబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాపారులకు ముందుగానే సమాచారం?
ఇక కాల్‌మనీ వ్యవహారంలో రెండో కోణం చూస్తే మరీ దారుణంగా కనిపిస్తోంది. వడ్డీ వ్యాపారులతో ఎప్పటి నుంచో కొందరు పోలీసులకు సత్సంబంధాలున్నాయి. పలు వివాదాలు, కేసుల్లో వారి మధ్య రాజీలు జరిగిన సందర్భంలో ఏర్పడిన పరిచయాలు ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. కొందరు వ్యాపారులను అజ్ఞాతంలోకి వెళ్లిపొమ్మని పోలీసులే సలహా ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రైడింగ్ వెళ్లేముందే వ్యాపారులకు సమాచారమిచ్చి, సర్దుకోమని సలహా ఇస్తున్నారని తెలుస్తోంది. దానివల్ల రైడింగ్ జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా వ్యాపారులు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. ఇలా పోలీసులకు, వడ్డీ వ్యాపారులకు మధ్య ‘మనం మనం తర్వాత చూసుకుందాం’ అనే ఒప్పందాలు జరుగుతున్నట్లు జిల్లావ్యాప్తంగా గుప్పుమంటోంది.