సాక్షి, అమరావతి : రాజధానిని ఎవరైనా మూడు ప్రాంతాల్లో పెడతారా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం అమరావతిలో ఉంటారా, విశాఖలో ఉంటారా, ఇడుపులపాయలో ఉంటారా అని అడిగారు. అసెంబ్లీ నుంచి తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం పక్కనున్న ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.
నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వకముందే రాజధానిపై సభలో ప్రకటించడం సరికాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాలవల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, రాష్ట్రాన్ని తుగ్లక్ మాదిరి పరిపాలిస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతిలో కావాలనే ఒక సామాజికవర్గంపై బురద జల్లుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు విశాఖలో భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. జగన్ ఎప్పుడేం చేస్తారో తెలియడంలేదని చంద్రబాబు అన్నారు. బినామీల పేరుతో భూములు కొనే ఖర్మ తమ పార్టీ నేతలకు లేదన్నారు. హెరిటేజ్ భూములు కొన్న ప్రాంతం రాజధానిలో లేదని తెలిపారు.
సంపద కేంద్రంగా అమరావతికి రూపకల్పన చేశాం
అంతకుముందు.. అసెంబ్లీలో రాజధాని అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని సంపద సృష్టించే కేంద్ర స్థానంగా రూపకల్పన చేశామని చెప్పారు. 13 జిల్లాలకు మధ్యలో ఉన్నందునే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాంతానికి వరద ముప్పులేదని, గతంలో ఎప్పుడూ ముంపునకు గురికాలేదని గ్రీన్ ట్రిబ్యూనల్‌తోపాటు సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు.
రాజధానిగా అమరావతే ఉండాలని చెప్పండి
కాగా, మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో చంద్రబాబు ఉలిక్కిపడి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఉండవల్లిలోని తన నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ అంశంపై ఎలా స్పందించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. చివరికి రాజధానిగా అమరావతే ఉండాలనేది టీడీపీ విధానమని.. ఇదే అందరూ చెప్పాలని చంద్రబాబు నేతలకు సూచించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాజధాని విషయాన్ని ప్రధాని, ఇతర కేంద్ర పెద్దలతో మాట్లాడాలని.. రైతులను ఢిల్లీ తీసుకెళ్లి వినతిపత్రాలు ఇప్పించాలని సమావేశంలో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment