సాక్షి, విజయవాడ : ‘గెలిచే పరిస్థితి ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఈసారి ఎన్నికల ఖర్చు కనీసం 25- 30 లక్షల రూపాయలు అవుతుంది. ఓడితే ఏప్రిల్ 3న మా ఇంటి ముందు అప్పుల వాళ్లు మూగుతారు. గెలుపుపై కనీస ఆశ ఉన్నా పోటీచేయవచ్చు. ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఈసారికి మౌనంగా ఉండిపోవడమే మంచిది...’- ఇది గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన కాంగ్రెస్ నేత మనోభావం. నగరంలో కాంగ్రెస్ పార్టీ దీనావస్థకు ఈ మాటలు అద్దం పడతాయి. రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల వేడి ఊపందుకుంటుంటే.. నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎన్నికల పేరెత్తడానికే బెదిరిపోతున్నారు.
గతంలో టికెట్ కోసం పోటీలు పడినవారే.. ఈ సారి పిలిచి సీటిస్తామంటున్నా స్పందించడంలేదు. అధికార పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రస్తుతం వారు ఏ పార్టీలో ఉన్నారో.. రేపు ఎక్కడ ఉంటారో కచ్చితంగా చెప్పలేని గందరగోళం నెలకొందని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ఎమ్మెల్యేలు చెబుతున్నా.. ఆ మాటలను కార్యకర్తలు విశ్వసించడంలేదు. ఈ దశలో ఎమ్మెల్యేలను నమ్ముకుని టికెట్ కోసం ప్రయత్నించడం అనవసరమనే భావనతో డివిజన్ స్థాయి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు డబ్బుతో ముడిపడి ఉంటాయని, కనీసం ఒక్కో అభ్యర్థి 20-30 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఓడిపోవడం తథ్యమని తెలిసి కూడా పోటీ చేయడం, అంత మొత్తం వదిలించుకోవడం ఎందుకని వారు బహిరంగంగా చెబుతున్నారు. కార్పొరేషన్ పదవి కాలం పూర్తయిన తర్వాత నాలుగేళ్లు ఖాళీగా ఉన్నామని, మరో ఐదేళ్లు మనవి కాదనుకుంటే సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రిజరేషన్లు అనుకూలంగా వచ్చినా తాము పోటీ చేయడానికి సిద్దంగా లేమని ఒక మహిళా కార్పొరేటర్ బాహాటంగా చెబుతున్నారు.
రిజర్వేషన్ల కారణంగా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న వారు మరింత ఆనందంగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో నెహ్రూ వర్గానికి చెందిన మాజీల్లో కూడా కొందరు మాత్రమే తప్పని సరి పరిస్థితుల్లో పోటీకి సిద్ధపడుతున్నారు.ఇప్పటి వరకూ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొత్తం ఐదు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు వామపక్షాలు, రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి తెలుగుదేశం అధికారాన్ని అందుకున్నాయి. తెలుగుదేశం మేయర్ పదవిని దక్కించుకున్నప్పుడు అత్యధిక కార్పొరేటర్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారి ఆ పార్టీ తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు కరువైన దుస్థితి నెలకొంది. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ మారి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలోనే ఉంటూ కార్పొరేటర్లుగా పోటీచేయకూడదని భావిస్తున్నవారు, బరిలోకి దిగాలనుకుంటున్నవారిని కూడా వారిస్తున్నట్లు సమాచారం. తమ గెలుపు, ఎన్నికల వ్యయం బాధ్యతలను ఎమ్మెల్యేలు భుజానకెత్తుకుంటారన్న భావనతో కొందరు పోటీకి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
పోటీకి అభ్యర్థులు కరువు
Published Thu, Mar 6 2014 12:39 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement