‘‘ఒకప్పటి రాజధానిని త్యాగం చేయడంతో అభివృద్ధిలో వెనుకబడ్డాం. ప్యాకేజీలు, పదవులకు ఆశపడి మరోసారి మోసపోకూడదు. రాజధాని ద్వారానే అభివృద్ధి సాధ్యం. కర్నూలును రాజధానిగా ప్రకటించే వరకు సమష్టి పోరాటం సాగిద్దాం. ఒక్కటై గళం వినిపిద్దాం.’’ అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని బిర్లా కాంపౌండ్‌లో ఉన్న శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఎస్వీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. కర్నూలు రాజధానిని కోల్పోవడం వల్ల రాయలసీమకు జరిగిన నష్టంపై సుదీర్ఘంగా చర్చించి కర్నూలు రాజధాని సాధన కమిటీని ఎన్నుకున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపురెడ్డి జనార్ధన్‌రెడ్డి కమిటీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు.
రాజధాని సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఉద్యమబాట పట్టాలని కర్నూలు రాజధాని సాధన కమిటీ పిలుపునిచ్చింది. శుక్రవారం స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమష్టిగా పోరాటం చేసి రాజధానిని సాధించుకుందామని ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని హంగులు కర్నూలులో ఉన్నాయని గుర్తు చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కర్నూలు చుట్టూ అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో వక్తల ప్రసంగాలు యథాతథంగా..
- కర్నూలు
రాజధాని ద్వారానే అభివృద్ధి సాధ్యం
రాజధాని ద్వారానే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజధాని కోల్పోవడంతో జరిగిన నష్టంపై రాయలసీమ ప్రజల్లో చైతన్యం తీసుకురాలి.
- గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి అయి ఉండి కూడా ఈ ప్రాంతాన్ని విస్మరిస్తున్నారు. కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందిందని, అక్కడ రాజధాని అవసరం లేదు. కర్నూలులో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
- మణిగాంధీ, కోడుమూరు ఎమ్మెల్యే
లక్షగళ ఘోష తరహాలో ఉద్యమం సాగాలి...
రాజధాని సాధన కోసం లక్షగళ ఘోష తరహాలో ఉద్యమం నిర్వహించాలి. అందుకోసం ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ అండదండలు ఎల్లప్పుడు ఉంటాయి.
- వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, కర్నూలు రాజధాని సమితి కమిటీ కన్వీనర్
జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలి..
రాజధాని సాధన కోసం జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చే విధంగా ఆందోళనలు ఉద్ధృతం చేయాలి. విద్యార్థి సంఘాలు మొదలుకొని వృద్ధుల సంఘాల వరకు అందరూ కూడా ఆందోళనలో పాలు పంచుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలి.
- చెన్నయ్య, లెక్చెరర్
ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు...
కర్నూలు రాజధాని సాధన కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు నిర్వహించాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల తరహాలోనే ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
- హేమలత, న్యాయవాదుల సంఘం జేఏసీ నాయకురాలు
రాజధాని సాధనే లక్ష్యంగా ఉద్యమం....
రాజధాని సాధనే లక్ష్యంగా ఉద్యమం సాగాలి. అందుకోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. రాజధాని సాధన కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 11వ తేదిన తెలుగుతల్లి విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే మహా ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలి.
- సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీ
చారిత్రక అవసరం...
పోగొట్టుకున్న రాజధానిని తిరిగి పొందడమనేది ఈ ప్రాంత ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభ్యున్నతికి తోడ్పడుతుంది. అందుకే రాజధాని సాధన ఒక చారిత్రక అవసరం. జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో కర్నూలును రాజధాని ప్రకటించాలి.
- ఓంకార్, లోక్‌సత్తా నాయకులు
కర్నూలు బంద్‌కు వ్యాపారుల మద్దతు
కర్నూలు రాజధాని సాధన కోసం ఈనెల 13వ తేదీన చేపట్టనున్న కర్నూలు నగర బంద్‌కు వ్యాపార సంస్థల సంపూర్ణ సహకారం ఉంటుంది. స్వచ్ఛందంగా దుకాణాలు మూసుకుని ఉద్యమంలో పాలు పంచుకుంటాం.
- విజయ్‌కుమార్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్
ఎన్‌జీఓల సంపూర్ణ మద్దతు
రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు, విజ యవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని ప్రయత్నించడం సమంజసం కాదు. కర్నూలు రాజధాని సాధన కోసం ఎన్‌జీఓల సంపూర్ణ మద్దతు ఉంటుంది. - వెంగళ్‌రెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసి ఛైర్మన్
రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు...
రాజధాని సాధన కోసం ఉద్యమం కర్నూలుకే పరిమితం కాకుండా సీమ వ్యాప్తం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజధాని కోసం ఉద్యమంలో పాల్గొనాలి.
- లీలమ్మ, టౌన్ స్కూల్స్ అసోసియేషన్ నాయకురాలు
అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి
కర్నూలు రాజధానితో పాటు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం పోరాటం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి.
- ప్రభాకర్‌రెడ్డి,
సీపీఎం జిల్లా కార్యదర్శి
రాజధానితో కూడిన స్వాతంత్య్ర వేడుకలు జరగాలి...
కర్నూలులో జరిగే స్వాతంత్య్ర వేడుకలను రాజధానితో కూడిన వేడుకలుగా జరపాలి. కర్నూలు రాజధాని కోసం చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది.
- బీవై.రామయ్య, డీసీసీ అధ్యక్షుడు
ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం
రాజధాని సాధన కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువకుల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు కలిసి రావాలి.
- కేవీ సుబ్బారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్
రాజధాని సాధనే ధ్యేయం
Published Sat, Aug 2 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement