- ఒకరు అరెస్టు, నలుగురు పరార్
- 200 కిలోల గంజాయి, వ్యాను స్వాధీనం
రోలుగుంట: పోలీసుల కళ్లు కప్పి ఆరటి గెలల చాటున గంజాయి తరలిస్తున్న వారిపై రోలుగుంట ఎస్‌ఐ బి.కృష్ణారావు సిబ్బందితో కలసి గురువారం వేకువజామున దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన వ్యాన్ ను, పది బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. మండలంలో చటర్జీపురం-సింగ రాజుపేట చింతపల్లి రూటులో వేనుతో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీ సులు ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు. సింగరాజుపేట వద్ద ఉన్న అరటి తోట నుంచి గెలలు వ్యాన్‌కు లోడు అవుతున్నాయి.
అక్కడకు వెళ్లి లోడును పరిశీలించగా గెలలు మాటున 10 గంజాయి బస్తా లు బయటపడ్డాయి. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రైవర్ నర్సీపట్నానికి చెందిన పరవాడ శ్రీను(38)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులు పరారయ్యారని, పట్టుబడ్డ గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.
ఏజెన్సీలో ముగ్గురు అరెస్టు
చింతపల్లిరూరల్: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అన్నవరం ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా లోతుగెడ్డ బ్రిడ్జి కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై అనుమానంగా వెళుతున్న వారిని తనిఖీ చేశామన్నారు. వారి వద్ద 30 కిలోల గంజాయి బ్యాగులను గుర్తించామన్నారు.
తమ్మంగుల పంచాయతీ బొడ్డజువ్వి గ్రామానికి చెందిన పాంగి బాబూరావు, కూతలపాలేనికి చెందిన సాగిన మత్స్యలింగం, జిరిడికి చెందిన వ్యాపారి యూసఫ్‌ల నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి విలువ రూ.50 వేలు ఉంటుందన్నారు.